కొన్ని రోజుల క్రితమే ఇండియన్ ప్రీమియర్ లీగ్-2026 కోసం మినీ వేలం జరిగిన విషయం తెలిసిందే. ఇందులో కొందరు ఆటగాళ్లకి కాసుల వర్షం కురువగా.. మరికొందరికి నిరాశే మిగిలింది. అలా బంపర్ బోనాంజా దక్కిన ఆటగాళ్లలో ఒకడు ఆస్ట్రేలియా వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ జోష్ ఇంగ్లిస్. ఐపిఎల్-2026 మినీ వేలంలో ఇంగ్లీస్‌ను ఏకంగా రూ.8.6 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ జట్టు దక్కించుకుంది. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఇంగ్లిస్ తన పెళ్లి, హనీమూన్ కారణంగా ఐపిఎల్‌లో కేవలం నాలుగు మ్యాచ్‌లు మాత్రమే ఆడుతానని ముందే ప్రకటించాడు.
ఇంగ్లిస్ వచ్చే ఏడాది ఏప్రిల్‌లో వివాహం చేసుకోనున్నాడు. దీంతో అతడు మూడు లేదా నాలుగు మ్యాచ్‌లు మాత్రమే ఆడుతానని తెలిపాడు. దీంతో అతన్ని పంజాబ్ కింగ్స్ జట్టు రిటైన్ చేసుకోకుండా వదిలేసింది. ఈ విషయంపై పంజాబ్ కింగ్స్ జట్టు కో-ఓవర్ వాడిగా స్పందించారు. ఇంగ్లిస్‌పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడికి ప్రొఫెషనలిజం లేదని మండిపడ్డారు. ఇంగ్లిస్‌ని తొలుత రిటైన్ చేసుకుందామని భావించామని.. కానీ, అతడు రిటెన్షన్ గడువు ముగిసే కేవలం 45 నిమిషాలకు ముందు తన వ్యక్తిగత కారణాలు చెప్పాడని అన్నారు. పెళ్లి, హనీమూన్ కారణంగా కేవలం మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడుతానని అతడు చెప్పాడని, అందుకే అతడిని వదులుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
ఇలా చెప్తూనే ఇంగ్లిస్‌కి వాడియా శుభాకాంక్షలు తెలిపారు. అతడు మంచి ఆటగాడని ప్రశంసించారు. ఆస్ట్రేలియా తరఫున కూడా మెరుగ్గా రాణిస్తున్నాడని.. మరి ఇప్పుడు ఐపిఎల్‌లో అన్ని మ్యాచ్‌లు ఆడుతాడో లేదో చూడాలని అన్నారు. అయితే లక్నో జట్టు భారీ ధర వెచ్చించి ఇంగ్లిస్‌ని కొనుగోలు చేయడంతో అతడు తన హనీమూన్ ప్లాన్‌ని రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 18న అతడి వివాహం జరిగిన వెంటనే అతడు లక్నో క్యాంప్‌కి వస్తాడని సమాచారం. అయినప్పటికీ.. ఐపిఎల్ ఆరంభ మ్యాచ్‌లకు అతడు దూరం అయ్యే అవకాశం ఉంది.