దుబాయ్: అండర్-19 ఆసియాకప్ టోర్నమెంట్‌లో భారత తమ విజయ పరంపరని కొనసాగిస్తోంది. శుక్రవారం శ్రీలంకతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో ఘన విజయం సాధించి.. ఫైనల్స్‌కు చేరింది. వర్షం, తడి ఔట్ ఫీల్డ్ కారణంగా ఈ మ్యాచ్‌లో 20 ఓవర్లకు కుదించారు. ఈ నేపథ్యంలో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 138 పరుగులు చేసింది. శ్రీలంక బ్యాటింగ్‌లో చమిక హీనతిగల(42), విమత్ దిన్సారా(32), సేథ్మికా సెనెవిరత్నే(30) రాణించారు. భారత బౌలింగ్‌లో హెనిల్ పటేల్, కనిష్క్ చౌహాన్ చెరి రెండు, కిషన్ కుమార్ సింగ్, దీపేశ్ దేవేంద్రన్, ఖిలన్ పటేల్ తలో వికెట్ తీశారు.
అనంతరం భారత్ ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయింది. 25 పరుగుల స్కోర్ వద్దే కెప్టెన్ ఆయుష్ మాత్రే(7), వైభవ్ సూర్యవంశీ(9) ఔట్ అయ్యారు. ఈ దశలో అరోన్ జార్జ్(58), విహాన్ మల్హోత్రా(61) ఇద్దరు జట్టును గెలిపించే భారాన్ని తమ భుజాలపై వేసుకున్నారు. ఇద్దరు కలిసి 114 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. ఈ క్రమంలో ఇరువురు అర్థశతకాలు సాధించారు. దీంతో భారత్ 18 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసి ఈ మ్యాచ్‌లో విజయం సాధించింది. మరో సెమీ ఫైనల్‌లో బంగ్లాదేశ్‌పై పాకిస్థాన్ విజయం సాధించింది. దీంతో డిసెంబర్ 21న జరిగే ఫైనల్ మ్యాచ్‌లో భారత్, పాకిస్థాన్‌తో తాడోపేడో తేల్చుకోనుంది.