అమెరికా తీసుకొచ్చిన కొత్త సోషల్ మీడియా వెట్టింగ్ పాలసీతో హెచ్1 బీ దరఖాస్తుదారులు వచ్చే ఏడాది అక్టోబరు వరకు ఎదురు చూడవలసిన పరిస్థితి తలెత్తింది. అనేక మంది వీసా దరఖాస్తుదారుల వీసా అపాయింట్‌మెంట్లు 2026 అక్టోబరు నెలాఖరు వరకు వాయిదా పడినట్టు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి. డిసెంబరు జనవరిలో జరగాల్సిన హెచ్1 బీ ,హెచ్4 వీసా ఇంటర్వూలను వచ్చే ఏడాది ఫిబ్రవరిమార్చికి రీషెడ్యూల్ చేసినట్టు ఇటీవల అమెరికా ఎంబసీ అధికారులు వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రక్రియ మరింత ఆలస్యమవుతున్నట్టు తెలుస్తోంది. వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలను క్షుణ్ణంగా స్క్రీనింగ్ చేసేందుకు అదనపు సమయం పడుతోందని , అందువల్లే ఇంటర్వూలను వాయిదా వేస్తున్నట్టు అమెరికా అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే అమెరికాలో ఉద్యోగాలు సాధించి, ప్రయాణాల కోసం టికెట్లు బుక్ చేసుకున్నవారు ఇబ్బందులు పడుతున్నారు. డిసెంబరు 15 నుంచి హెచ్1బి, హెచ్4 వీసా దరఖాస్తుదారులకు సోషల్ వెట్టింగ్‌ను అమెరికా ప్రారంభించింది. దీనికి వీలుగా దరఖాస్తుదారులు తమ సోషల్ మీడియా ఖాతాలను ప్రైవేటు నుంచి పబ్లిక్‌కు మార్చుకోవాలని అమెరికా విదేశాంగ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జాతీయ భద్రతలో భాగం గానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అమెరికా వెల్లడించింది.