చత్తీస్‌ఘడ్ రాష్ట్రం, సుక్మా జిల్లా, కిష్టారం పోలీస్‌స్టేషన్ పరిధిలో డిఆర్‌జి సిబ్బందికి, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. గురువారం చత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా, కిష్టారం పోలీస్‌స్టేషన్ పరిధిలోని సింగనమరుగు అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న డిఆర్‌జి సిబ్బందికి తారసపడ్డారు. దీంతో మావోయిస్టులు డిఆర్‌జి సిబ్బందిపైకి కాల్పులు జరపడంతో బలగాలు ఎదురు కాల్పులు జరిపినట్లు, కాల్పుల అనంతరం సంఘటన ప్రాంతాన్ని పరిశీలించగా ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలు లభ్యమైనట్లు తెలిపారు. ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టుల్లో కిష్టారం ఏరియా కమిటీ ఏసీఎం సభ్యుడు మడవి జోగ, కిష్టారం ఏరియా కమిటీకి చెందిన సభ్యుడు సోది బంది, కిష్టారం ఏరియా కమిటీకి చెందిన మరో మహిళా మావోయిస్టు ఏసీఎం సభ్యురాలు నూప భజిని ఉన్నట్లు వెల్లడించారు. మృతదేహాలతో పాటు సంఘటన ప్రాంతంలో పలు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.