అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడలో గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. అజిత్ సింగ్ నగర్ లూనా సెంటర్‌లో ఓ ఇంట్లోకి చొరబడి మహిళపై హత్యాయత్నానికి దిగారు. బుధవారం సాయంత్రం ఓ మహిళ తన ఇంట్లో టివి వీక్షిస్తుంది. గంజాయి మత్తులో ఓ యువకుడు ఇంట్లోకి చొరబడి వీరంగం సృష్టించాడు. మహిళ చీరలాగి ఆమెపై అఘాయిత్యానికి యత్నించాడు. ఆమె అతడిని అడ్డుకొని బయటకు తోసేసింది. అనంతరం అతడు మరో మహిళతో కలిసి ఇంటి వద్దకు చేరుకున్నాడు. చంపేస్తామంటూ కారం, క్రికెట్ బ్యాట్, రాళ్లతో గంజాయి బ్యాచ్ దాడి చేసింది. తన వెనుక ఓ ప్రజాప్రతినిధి ఉన్నాడని తనని ఏం చేయలేరని గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. మహిళ, ఆమె కొడుకును చంపేస్తానంటూ గంజాయి బ్యాచ్ బెదిరింపులకు దిగింది. స్థానికులు భయాందోళనకు గురికావడంతో పాటు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకొని గంజాయి బ్యాచ్ ను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. గంజాయి బ్యాచ్ రోజు కు రోజు శృతి మించి దాడులకు పాల్పడుతోందని స్థానికులు వాపోతున్నారు. ఆడ పిల్లలను బయటకు పంపాలంటే భయం వేస్తుందని స్థానికులు వాపోతున్నారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇంట్లో ఉన్నవారికే రక్షణ లేకుండా పోయిందని, బయటకు వెళ్లిన వారి పరిస్థితి ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ప్రజాప్రతినిధులు ఉన్నారనే దైర్యంతో కొందరు దాడులకు పాల్పడడంతో పాటు బెదిరింపులకు దిగుతున్నారని దుయ్యబట్టారు.