తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. రూ.15 వేల కోట్ల విలువ చేసే భూములకు సంబంధించి సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం సమీపంలోని సాహెబ్ నగర్ పరిధిలో ఉన్న సుమారు 102 ఎకరాల విలువైన భూమి ప్రభుత్వానిదేనని, అది అటవీ ప్రాంతమేనని కోర్టు స్పష్టం చేసింది. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం ఈ భూమి విలువ దాదాపు రూ. 15,000 కోట్లు ఉంటుందని అంచనా. ఈ భూమి తమదేనంటూ నిజాం, సాలార్‌జంగ్, మీరాలం వారసులమని చెప్పుకునే సుమారు 260 మందికి పైగా వ్యక్తులు గతంలో పిటిషన్లు దాఖలు చేశారు. గతంలో ఈ వివాదంపై విచారణ జరిపిన హైకోర్టు, ప్రైవేటు వ్యక్తులకు అనుకూలంగా తీర్పునిచ్చింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటి షన్లపై సుదీర్ఘ విచారణ చేపట్టిన జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ ఎస్.వి.ఎన్. భట్టిల ధర్మాసనం తాజాగా తుది తీర్పును వెలువరించింది.
సాహెబ్ నగర్‌లోని ఆ 102 ఎకరాల భూమిపై ప్రైవేటు వ్యక్తులకు ఎటువంటి యాజమాన్య హక్కులు లేవని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఇది పూర్తిగా అటవీ భూమి అని.. దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికే పూర్తి అధికారాలు ఉంటాయని స్పష్టం చేసింది. ప్రైవేటు వ్యక్తులు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టి వేస్తూ, ప్రభుత్వ వాదనతో ఏకీభవించింది. ఈ తీర్పుతో వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ ఆస్తి అన్యాక్రాంతం కాకుండా దక్కినట్లయిం ది. అంతేకాకుండా ఈ తీర్పు వెలువడిన ఎనిమిది వారాల్లోపు సదరు 102 ఎకరాల భూమిని రిజర్వ్ ఫారెస్ట్‌గా నోటిఫై చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సుప్రీంకోర్టు ఆదేశించింది. నోటిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత, దానికి సంబంధించిన కాపీని సుప్రీంకోర్టు రిజిస్ట్రీకి సమర్పించాలని కూడా సూచించింది.