పథకాల పేర్లు మార్చడంలో, వాటిని నిర్వీర్యం చేయడంలోనూ కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు పార్టీలు దొందు దొందే అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విమర్శించారు. జాతీయ ఉపాధి హామీ పథకం నుండి మహాత్మా గాంధీ పేరును తొలగించడం ద్వారా బిజెపి తన సంకుచితత్వాన్ని చాటుకుందని, పల్లె ప్రజల ఉపాధిని దెబ్బతీసేలా కేంద్రం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. జాతిపిత పేరును తొలగించిన బిజెపికి జాతీయ పార్టీ అని చెప్పుకునే నైతిక హక్కు లేదని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు రూ. 5లకే భోజనం అందించే అన్నపూర్ణ క్యాంటీన్ల పేరును ఇందిరమ్మ క్యాంటీన్లుగా మార్చడం చిల్లర రాజకీయమని విమర్శించారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకలైన బతుకమ్మ చీరలను నిలిపివేసి, నేతన్నల పొట్టకొట్టి, ఇప్పుడు వాటికి రాజకీయ రంగు పులుముతూ ఇందిరమ్మ చీరలుగా మార్చడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. అలాగే తెలంగాణ ఆత్మగౌరవ చిహ్నమైన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి, కాంగ్రెస్ తల్లిని ప్రజలపై రుద్దడం అమానుషమని ధ్వజమెత్తారు.
కెసిఆర్ ప్రవేశపెట్టిన విప్లవాత్మక పథకాలైన రైతుబంధును రైతుభరోసాగా మార్చి రైతులకు అందకుండా చేస్తున్నారని, కెసిఆర్ కిట్లు, న్యూట్రీషన్ కిట్లను నిలిపివేసి తల్లీబిడ్డల ఆరోగ్యంతో కాంగ్రెస్ ఆటలాడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో అవార్డులు తెచ్చిపెట్టిన పల్లె ప్రగతి, హరితహారం వంటి పథకాల పేర్లు మార్చి వాటికి నిధులు ఇవ్వకుండా ఎండబెడుతున్నారని ఆరోపించారు.గతంలో వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి పథకాలను అదే పేర్లతో కొనసాగించి కెసిఆర్ తన విశాల దృక్పథాన్ని చాటుకున్నారని గుర్తు చేశారు. ప్రజలకు మేలు చేయడం కంటే కేవలం పేర్లు మార్చి ప్రజలను ఏమార్చడమే లక్ష్యంగా ఈ ఢిల్లీ పార్టీలు పనిచేస్తున్నాయని విమర్శించారు. దేశ ముఖచిత్రాన్ని మార్చే ఆలోచన ఈ పార్టీలకు లేదని, 150 కోట్ల భారతీయులు ఈ రాజకీయాల వల్ల నష్టపోతున్నారని పేర్కొన్నారు. ప్రజలు త్వరలోనే ఈ రెండు పార్టీల భరతం పడతారని కెటిఆర్ హెచ్చరించారు.