మహబూబ్‌నగర్ జిల్లా ముసాబ్‌పేట మండలంలోని వేముల గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఊరంతా సర్పంచ్ సంబురాల్లో ఉండగా అదే రోజు ప్రేమోన్మాది దళిత యువతిపై ఆఘాయిత్యానికి పాల్పడి ఆపై దారుణంగా హత్య చేశాడు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి… వేముల గ్రామానికి చెందిన ప్రవళిక, విష్ణులు గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి సర్పంచ్ ఎన్నికలు ముగియడంతో, గెలిచిన వారు సంబురాల్లో మునిగి పోయారు. ప్రవళికకు ఫోన్ చేసిన విష్ణు స్థానిక రైతు వేదిక వద్దకు రావాలని చెప్పాడు. విష్ణు మాటలను నమ్మిన ప్రవళిక రైతు వేదిక వద్దకు చేరుకుంది. ఈ సందర్భంగా ఇరువురి మధ్య ఏమి జరిగిందో తెలియదు కాని ప్రవళిక తీవ్ర రక్త స్రావంతో సృహ తప్పి పడిపోయింది.
కూతురు ఎంతకీ ఇంటికి రాకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు ప్రవళిక ఆచూకీ కొసం వెతక సాగారు. తెలిసిన వారు డిజె సౌండ్‌తో గుండె నొప్పితో పడిపోయిందని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. దీంతో హుటాహుటిన చేరుకున్న యువతి బంధువులు ఆమె పడి ఉన్న ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడ తీవ్ర రక్తస్రావంతో పడి ఉన్న ప్రవళికను తీసుకొని స్థానిక ఆర్‌ఎంపి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆమె మృతి చెందింది. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. విష్ణును అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా బంధువులు మాత్రం విష్ణుతో పాటు మరి కొందరు అత్యాచారం చేసి హత్య చేశారని ఆరోపిస్తున్నారు. ప్రవళిక కుటుంబానికి న్యాయం చేసి నిందితున్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.