పార్లమెంట్‌లో తన పనితీరుతో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా దాదాపు అన్ని రాజకీయ పక్షాల నుండి అభినందనలు అందుకుంటున్నారు. సోదరుడు రాహుల్ గాంధీ కన్నా ఆమె పరిణితితో వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం పలువురిలో కలుగుతుంది. మరోవంక రాహుల్ గాంధీ నాయకత్వం పనితీరు పట్ల సొంత పార్టీ నేతల నుండే విముఖత వ్యక్తం అవుతున్నది. ఈ పరిణామాలు రాహుల్ గాంధీలో అసహనాన్ని పెంచుతుందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. హిందీలో ఆమె ప్రసంగాలు అర్థవంతంగా ఉంటున్నాయని, ప్రభుత్వ విధానాలపై సున్నితంగా విమర్శలు చేస్తూనే బాధ్యతాయుతంగా మాట్లాడుతున్నారని, పైగా నిర్మాణాత్మక సూచనలు కూడా చేస్తున్నారనే అభిప్రాయం కలుగుతుంది. ఆమె ఏ అంశంపై ప్రసంగం చేసినా ముందుగా తగు విధంగా తయారై, నోట్స్ పట్టుకొని అందరినీ ఆకట్టుకొనే విధంగా మాట్లాడుతున్నారని అభిప్రాయం కలుగుతుంది. పైగా, ఆమె తన వయనాడ్ నియోజకవర్గానికి కేంద్రం సహాయం కోరుతూ అమిత్ షా, జెపి నడ్డా వంటి సీనియర్ కేంద్ర మంత్రులను కలవడం, హోం వ్యవహారాల పార్లమెంటరీ కమిటీలో చురుకైన సభ్యురాలుగా వ్యవహరించడం గమనిస్తుంటే రాహుల్‌కు పూర్తిగా భిన్నమైన వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తున్నారని స్పష్టం అవుతుంది. పైగా, సమావేశాలలో పార్టీలకు అతీతంగా తోటి ఎంపిలతో స్నేహపూర్వకంగా సంబంధాలను ఏర్పరచుకుంటున్నారు.
అందుకు పూర్తి విరుద్ధంగా, రాహుల్ సాధారణంగా అధికార పార్టీ నేతలపట్ల కఠినంగా, దూరంగా ఉంటారు. రాష్ట్రాల నుండి సొంత పార్టీ నేతలకు సైతం ఆయన అందుబాటులో ఉండటం లేదు. ఆయనను కలవాలంటే ఆయనకు సన్నిహితులైన కొందరు నాయకులను ప్రసన్నం చేసుకోవాల్సి ఉంటుంది. రాహుల్ లేవనెత్తే అంశాలపై ప్రభుత్వం నుండి తీవ్రమైన దాడులు ఎదురు కావడమే కాకుండా ఇండియా కూటమి పక్షాల నేతల నుండి కూడా సంఘీభావం ఎదురు కావడం లేదు. చివరకు సొంత పార్టీ నేతలు సైతం పట్టించుకోవడం లేదు. అదానీ, -అంబానీ గుత్తాధిపత్యం లేదా ‘ఓటు చోరీ‘ గురించి ఆయన పల్లవి అయినా, ఆయన సమస్యల ఎంపిక అయినా గందరగోళంగా ఉంటుందని, లోతుగా పరిశోధన చేస్తున్నట్లు ఉండటం లేదని, అప్రయత్నంగా ప్రభుత్వంపై పరుషంగా చేస్తున్న పలు విమర్శలు కాంగ్రెస్ పార్టీనే ఆత్మరక్షణలో పడవేస్తున్నవని పలువురు సొంత పార్టీ నేతలే వాపోతున్నారు.
ఆపరేషన్ సిందూర్ తర్వాత, ట్రంప్ కారణంగా భారతదేశం లొంగిపోయిందని రాహుల్ ప్రధాని నరేంద్ర మోడీని ఎగతాళి చేశారు. భారత ఆర్థిక వ్యవస్థను ‘చనిపోయినట్లు’ అమెరికా అధ్యక్షుడు చేసిన వర్ణనను ఆమోదిస్తూ విమర్శలు గుమ్మరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీని ఎగతాళి చేసే హడావుడిలో జాతీయవాద భావాలను కించపరుస్తున్నామనే అంశాన్ని రాహుల్ మర్చిపోయారని కాంగ్రెస్ వర్గాల నుండే అసంతృప్తి వ్యక్తం అవుతుంది. మరోవైపు, ఆపరేషన్ సిందూర్‌పై తన పార్లమెంటు ప్రసంగంలో ప్రియాంక సంయమనంతో, ఉగ్రవాదులు బైసరన్ లోయలోకి ప్రవేశించడానికి అనుమతించిన భద్రతా లోపాలకు ఎవరైనా జవాబుదారీగా ఉండాలని అంటూ సంబంధిత అంశాన్ని లేవనెత్తారు. ప్రభుత్వాన్ని సున్నితంగా విమర్శిస్తూనే దేశ ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా ఆమె జాగ్రత్త పడుతున్నారు. ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి కొత్త చట్టాన్ని తీసుకురావాలన్న నరేంద్ర మోడీ ప్రభుత్వ ప్రతిపాదనపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించాలన్న ప్రభుత్వ ప్రతిపాదన వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటని అంటూ సున్నితంగా ప్రశ్నించారు. పైగా, పేరు మార్చడం వల్ల కొత్తగా స్టేషనరీ, బోర్డుల ముద్రణకు అదనపు ఖర్చు తప్ప ప్రయోజనం ఏముంటుందని ఎద్దేవా చేశారు.
రాహుల్ నాయకత్వంపై పెరుగుతున్న అసంతృప్తి కారణంగా సాధారణంగా సౌమ్యులైన కాంగ్రెస్ సీనియర్ నేతలలో సైతం అసహనాన్ని కలిగిస్తున్నది. ఇప్పటికే ఆమెను చూస్తుంటే ఇందిరా గాంధీ గుర్తు వస్తుందని అనుకుంటున్న కాంగ్రెస్ యువ నేతలకు ప్రియాంక గాంధీలో మరో అవకాశం కనిపిస్తోంది. రాహుల్ నిశితంగా తరచూ విమర్శలు కురిపించే బిలియనీర్ గౌతమ్ అదానీతో బహిరంగంగా సహవాసం చేస్తున్నట్లు కనిపించడానికి కూడా పలువురు కాంగ్రెస్ నేతలు వెనుకాడటం లేదు. భోపాల్‌లో జరిగిన అదానీ కంపెనీ డైరెక్టర్ వివాహానికి దిగ్విజయ్ సింగ్ హాజరు కాగా, సుశీల్ కుమార్ షిండే తన సొంత మనవరాలి వివాహంలో వివాదాస్పద పారిశ్రామికవేత్తతో కలిసి ఫోజులిచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదానీలు, అంబానీలు ఇద్దరితోనూ ఒప్పందాల కోసం వెంటపడుతున్నారు. కాంగ్రెస్ మిత్ర పక్ష ఎంపిలైన సుప్రియా సులే, మహువా మొయిత్రా బిజెపి ఎంపి కంగనా రనౌత్‌తో కలిసి మాజీ కాంగ్రెస్ సభ్యుడు, బిజెపి ఎంపి నవీన్ జిందాల్ కుమార్తె వివాహంలో బాలీవుడ్ పాట ‘దీవాంగి దీవాంగి’కి వేదికపై నృత్యం చేశారు.
తాజాగా బీహార్‌లో ఇండియా కూటమి ఘోర వైఫల్యానికి రాహుల్ గాంధీ కారణం అంటూ ఆర్‌జెడి నేత తేజస్వి యాదవ్ బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మలికార్జున ఖర్గే అయితే ఎన్నికల తర్వాత సోనియా గాంధీని కలిసి రాహుల్ వ్యవహారంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ కొడుకును మందలించమని కోరినట్లు తెలుస్తోంది. హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా కూడా రాహుల్, ఆయన చుట్టూ ఉన్న బృందం దుందుడుకు చర్యల కారణంగానే కాంగ్రెస్‌తో పాటు, మిత్రపక్షాలు నష్టపోయిన్నట్లు ఖర్గే స్పష్టం చేస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ వంటి వారిని ఎంతో కష్టపడి ‘ఇండియా కూటమి’ లోకి తీసుకు వస్తే వెళ్లిపోయేటట్లు చేశారని కూడా వాపోతున్నారు. తాజాగా కాంగ్రెస్ లో జాతీయ స్థాయి నాయకత్వ సంక్షోభాన్ని ఎత్తిచూపినందుకు ఒడిశాలో పార్టీ సీనియర్ నేత మొహమ్మద్ మోకిమ్‌ను ‘పార్టీ వ్యతిరేక కార్యకలాపాల’ కారణంగా పార్టీ నుండి బహిష్కరించారు.
పార్టీ పునరుజ్జీవనం కోసం లోతైన నిర్మాణాత్మక, సంస్థాగత, సైద్ధాంతిక పునరుద్ధరణకు పిలుపు ఇవ్వడంతో పాటు ఖర్గే వంటి వృద్ధతర నేతలను పక్కన పెట్టి ప్రియాంకకు జాతీయ నాయకత్వం ఇవ్వాలని సూచిస్తూ నేరుగా సోనియా గాంధీకి లేఖరాయడం సహజంగానే పార్టీ నాయకత్వానికి ఆగ్రహం కలిగించింది. పార్టీ తనపై చర్య తీసుకుంటుందని తెలిసి కూడా మోకిమ్ ఉద్దేశపూర్వకంగానే ఆ విధమైన విమర్శలు చేశారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ‘కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఎప్పుడూ ‘దారో మత్’ అని అంటారు. పార్టీని ప్రభావితం చేసే సమస్యలను ఎత్తిచూపుతూ సోనియా గాంధీకి లేఖ రాయడానికి నేను ఆయన నినాదం నుండి ప్రేరణ పొందాను. పార్టీ దానిని అంగీకరించలేదు. నన్ను కాంగ్రెస్ నుండి బహిష్కరించింది. నేను ఇంకేమీ చెప్పలేను’ అని మోకిమ్ తన బహిష్కరణ తర్వాత నిస్సహాయతను వ్యక్తం చేశారు. సోనియా గాంధీకి రాసిన తీవ్రమైన లేఖలో, మోకిమ్ తప్పుడు నాయకత్వ ఎంపికలు, అగ్ర నాయకత్వం- కార్యకర్తల మధ్య దూరం పెరగడం, యువతతో కనెక్ట్ కాలేకపోవడం కారణంగానే కాంగ్రెస్ వరుసగా దెబ్బలు తింటున్నట్టు వివరించారు. పలు రాష్ట్రాల్లో పార్టీ ఇటీవల జరిగిన ఎన్నికల పరాజయాలపై, మోకిమ్ మాట్లాడుతూ ‘లోతైన సంస్థాగత డిస్‌కనెక్ట్’ ని ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు.
మల్లికార్జున్ ఖర్గే (83) వయస్సును ఉదహరిస్తూ ఆయన నాయకత్వాన్ని మోకిమ్ ప్రశ్నించారు. రాహుల్ గాంధీని మూడు సంవత్సరాలుగా కలవడానికి తాను చేసిన విఫల ప్రయత్నాన్ని కూడా మోకిమ్ ఈ సందర్భంగా ఎత్తి చూపారు. అందుకు అడ్డుగా నిలబడుతున్న కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ తనకు ఇష్టమైన వారిని తప్ప దగ్గరకు రానీయడంలేదని విమర్శించారు. శశిథరూర్ వంటి నాయకులు దూరంగా ఉండడానికి సైతం వేణుగోపాల్ వంటి వారనే అభిప్రాయం బలపడుతుంది. అటువంటి నేతలతో రాహుల్ నేరుగా చర్చించే ప్రయత్నం చేయకపోవడం పార్టీ నాయకత్వంలో అగాథాన్ని పెంచుతుంది. రాహుల్ గాంధీని కలిసేందుకు సుదీర్ఘకాలం ప్రయత్నించి, విఫలమైన ప్రస్తుత అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిస్వా శర్మ కాంగ్రెస్ నుండి బిజెపిలో చేరారు.
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ సైతం కాంగ్రెస్ ధోరణితో విసుగు చెందే పార్టీకి దూరం అయ్యారు. ప్రజలతో సంబంధం లేని నాయకులను దగ్గరకు చేర్చుకుని, ప్రజలను ప్రభావితం చేయగల వారిని దూరంగా పెడుతూ ఉండటం కారణంగానే కాంగ్రెస్ రాజకీయంగా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందనే వాస్తవాన్ని గ్రహించలేకపోతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ లో అనేకమంది రాహుల్ గాంధీ పట్ల ఇటువంటి అసహనాన్ని, అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్‌రెడ్డి వంటి నాయకులే ఆయనను అత్యవసరం అనుకున్నప్పుడు కూడా కలవలేకపోతున్నారు. గతంలో సోనియా గాంధీ సారథ్యం వహించినప్పుడు ఆమె తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకున్నప్పటికీ అందరి అభిప్రాయాలు వినేందుకు ప్రయత్నించేవారు.
– చలసాని నరేంద్ర
98495 69050