త్వరలోనే భారతీయ రోడ్లపైకి వినూత్న రీతిలో ఉండే భారత్ టాక్సీలు ప్రవేశించనున్నాయి. ఇప్పుడున్న ఉబెర్, ఓలా, రాపిడో వంటి ప్రయాణ సాధనాలకు ఇవి పూర్తిగా భిన్నమైనవి.భారత ప్రభుత్వ తెరవెనుక సంపూర్ణ మద్దతుతో పలు విశిష్ట ప్రత్యేకతలతో ఇవి సత్వర సుఖవంత ప్రయాణాలు ఆశించే ప్రజల కోసం అందుబాటులోకి రానున్నాయని వెల్లడైంది. మెట్రో నగరాలలో ఇప్పుడు ప్రభుత్వ రంగ రవాణా సంస్థల వాహనాలను తలదన్నుతూ ప్రైవేటు రంగ వాహనాలు దూసుకుపోతున్నాయి. ప్రయాణికుల అవసరాలను తీరుస్తున్నాయి. అయితే అత్యధిక రేటు, కొన్ని భద్రతాపరమైన కారణాలతో వీటిని కూడా వద్దనుకునే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో అందరికి అందుబాటులో ఉండేలా కొత్త సంవత్సరం జనవరి 1 నుంచి ఈ భారత్ టాక్సి అందుబాటులోకి రానుంది. సంబంధిత వాహనాల ఫోటోలు కూడా వెలువడ్డాయి. ఈ వాహన సేవలను సహకార్ టాక్సీ కో ఆపరేటివ్ లిమిటెడ్ నిర్వహిస్తుంది. పలు ఉన్నత స్థాయి ప్రతిష్టాత్మక కంపెనీలు అమూల్, ఇఫ్కో , నాబార్డ్ వంటి వాటి సహకారంతో ఈ కో ఆపరేటివ్ సంస్థ ఏర్పడింది. ఈ ప్రయత్నానికి కేంద్ర ప్రభుత్వం సహకారం ఉండటంతో భారత్ టాక్సి పూర్తి స్థాయి పారదర్శకతతో సాగుతుందని ఆశలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే ప్రయోగాత్మకంగా ఈ టాక్సీలను ఢిల్లీ, గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాలలో నడిపిస్తున్నారు. పది పదిహేను రోజుల్లోనే దేశమంతటా ఇవి విస్తరిస్తాయి. ఇక భారత్ టాక్సీ యాప్ కూడా ఆండ్రాయిడ్ , ఐఒఎస్‌లలో డౌన్‌లోడ్ చేశారు. ఇతర రవాణా సంస్థల లోటుపాట్లను గుర్తించి తగు విధంగా సర్దుబాట్లతో వినూత్న రీతిలో భారత్ టాక్సీలు రంగంలోకి దిగేందుకు కొత్త సంవత్సరం వరకూ ఆగి ఉంటే చాలునని రవాణా సంబంధిత అధికారులు తెలిపారు. అయితే వాటిపై అధికారిక నిర్థారణ ఇంతవరకూ వెలువడలేదు.