మన తెలంగాణ/సిటీ బ్యూరో: ‘జంట జలాశయాల్లోకి గరళం’ అనే శీర్షికన గురువారం ‘మనతెలంగాణ’ దిన పత్రిక ప్రచురించిన కథనానికి జలమండలి అధికారులు స్పందించారు. సెప్టిక్ ట్యాంకర్ ద్వారా గండిపేట జలాశయంలోకి మానవ వ్యర్థాలను అక్రమంగా వదులుతున్న తీరుపై ప్రచురితమైన కథనాన్ని అధికారులు తీవ్రం గా పరిగణించారు. బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలని జలమండలి ఎండి అశోక్‌రెడ్డి ఆదేశించడంతో మొయినాబాద్ పోలీసులకు ఉస్మాన్‌సాగర్ డివిజన్ సీజిఎం నరహరి ఫిర్యాదు చేశారు. విచారణ లో సైదాబాద్ సింగరేణి కాలనీకి చెందిన రమావ త్ శివనాయక్ ట్యాంకర్ ద్వారా జలాశయంలోకి వ్యర్థాలను వదిలినట్టు తేలడంతో సెప్టిక్ ట్యాంకర్‌ను సీజ్ చేసి, డ్రైవర్ రమావత్ శివనాయక్‌తో పాటు హిమాయత్‌సాగర్‌కు చెందిన నిరంజన్‌లపై క్రిమినల్ కేసుల నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ట్యాంకర్‌పై జీహెచ్‌ఎంసి, జలమండలి సంస్థలకు చెందిన అధికారిక లోగోలు ఉండటం గమనార్హం. జంట జలాశయాల్లో సెప్టిక్ ట్యాంకర్ ద్వారా మానవ వ్యర్థాలను ఎప్పటి నుండి కలుపుతున్నారు..? ఎవరు కలపాలని సూచించారు..? ఎందుకు ఇలా చేస్తున్నారు..? వీరి వెనుక ఎవరై నా ఉన్నారా..? అనే కోణంలో జలమండలి అధికారులతో పాటు మొయినాబాద్ పోలీసులు విచారిస్తున్నారు. మరల ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చేపట్టేందుకు జలాశయాల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లను జలమండలి అధికారులు చేపట్టారు.
ఆందోళన వద్దు.. జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి
జలాశయాల్లో ఎలాంటి వ్యర్థాలు కలువకుండా.. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని జలమండలి ఎండి అశోక్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్ మహా నగరానికి స్వచ్చమైన నీటిని సరఫరా చేస్తున్నామని, ఇందులో ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని ఆయన పేర్కొన్నారు. గండిపేట నీటిని ఆసిఫ్‌నగర్, మీరాలం వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌లకు తరలించి ప్రతి గంటకు నీటి ప్రమాణాలను పరీక్షిస్తామని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి వెల్ల్డించారు. అక్కడ నీటి సరఫరాలో జలమండలి ఇప్పటికే మూడంచెల క్లోరినేషన్ ప్రక్రియ పద్దతిని అవలంబిస్తుందని ఆయన తెలిపారు. మొదటి దశలో నీటి శుద్ధి కేంద్రాల (డబ్య్లూటీపీ) వద్ద, రెండో దశలో మెయిన్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల (ఎంబీఆర్) వద్ద, చివరగా సర్వీస్ రిజర్వాయర్ల వద్ద బూస్టర్ క్లోరినేషన్ ప్రక్రియ జరుగుతుందని పేర్కొన్నారు. ప్రజలకు సరఫరా అవుతున్న నీటిలో కచ్చితంగా 0.5 పీపీఎం క్లోరిన్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు వివరించారు. నగర ప్రజలకు శుద్ధమైన నీరు అందించేందుకు ఇండియన్ స్టాండర్డ్ (ఐఎస్- 10500-2012) ప్రమాణాలను పాటిస్తూ.. శాస్త్రీయంగా తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలనూ తీసుకుంటామని చెప్పారు. ప్రజాలెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విజ్ఞప్తి చేశారు.