ఖమ్మం జిల్లా కారేపల్లి మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ దౌలూరి శుభకామేశ్వరి దేవి ఎసిబి వలలో చిక్కారు. ఎసిబి డిఎస్పి వై.రమేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి… కారేపల్లి మండలానికి చెందిన ఓ వ్యక్తి దగ్గర ఆర్‌ఐ శుభ కామేశ్వరి దేవి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ నివేదికను రాసేందుకు పదివేల రూపాయలు డిమాండ్ చేసింది. దీంతో బాధితుడి నుంచి లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు రెడ్ హ్యాండ్‌గా పట్టుకున్నారు. బాధితుని ఫిర్యాదుతో కారేపల్లిలోని ఆమె ఇంటి వద్ద ఎసిబి సిబ్బందితో వలవేసి పట్టుకున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా డిఎస్పి రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు ఏదైనా పని చేసేందుకు లంచం అడిగితే ఎసిబి టోల్ ఫ్రీ నెంబర్ 1064 నెంబర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. ఫిర్యాదుదారుని వివరాలను గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు.