ప్రభుత్వం గురువారం నాడు రీజినల్ రూరల్ బ్యాంక్స్ (ఆర్‌ఆర్‌బి) కొత్త లోగోను ఆవిష్కరించింది. ఒకటే, ఏకైక బ్రాండ్ గుర్తింపును సూచించడానికి ఈ లోగోను తీసుకొచ్చినట్టు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ వెల్లడించింది. ప్రభుత్వం ఆవిష్కరించిన వన్ స్టేట్ వన్ ఆర్‌ఆర్‌బి అనే విధానంతో 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 26 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు (ఆర్‌ఆర్‌బి) 2025 మే 1 నుంచి ఏకమయ్యాయి. మరింత పటిష్టమైన, సమర్థవంతమైన ఆర్‌ఆర్‌బిల నిర్మాణం దిశగా ముందు వెళ్లడంలో ఈ సంస్కరణ ముఖ్యమైన అడుగు కానుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 28 ఆర్‌ఆర్‌బిలు దాదాపు 700కి పైగా జిల్లాల్లో 22 వేల శాఖల నెట్‌వర్క్‌తో సేవలందిస్తున్నాయి. కీలక విలీనం ప్రక్రియ తర్వాత ప్రాంతీయ బ్యాంకులకు ఒకే బ్రాండ్ గుర్తింపు తీసుకురావడంలో భాగంగా 28 ఆర్‌ఆర్‌బిలకు కామన్ లోగోను ఆవిష్కరించినట్టు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.