అడిలైడ్: ప్రతిష్టాత్మక యాషెస్ 2025-26లో భాగంగా అడిలైడ్ ఓవెల్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో తొలి రోజు ఆట ముగిసింది. ఇప్పటికే ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియా రెండు మ్యాచుల్లో విజయం సాధించి ఆధిక్యంలో ఉంది. ఇక మూడో మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేసేందుకు ముందుకొచ్చింది. ఈ మ్యాచ్ ఇంగ్లండ్‌కి చావో-రేవో తేల్చుకొనే పరిస్థితి వచ్చింది. దీంతో ఇంగ్లండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. 94 పరుగులకే నాలుగు వికెట్లు పడగొట్టారు. ఐపిఎల్‌లో అత్యధికంగా రూ.25.20 కోట్లకు అమ్ముడుపోయిన కామరూన్ గ్రీన్ ఈ మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు.
ఈ నేపథ్యంలో అలెక్స్ క్యారీ, ఉస్మాన్ ఖవాజాలు కలిసి మ్యాచ్‌ను తమకు అనుకూలంగా మార్చే ప్రయత్నం చేశారు. ఐదో వికెట్‌కి 91 పరుగులు జోడించారు. ఆ తర్వాత ఖవాజా (82) హాఫ్ సెంచరీ చేసి ఔట్ కాగా, క్యారీ మాత్రం పట్టు వదలకుండా బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలో అతడు సెంచరీ సాధించాడు. అయితే విల్ జాక్స్ బౌలింగ్‌లో క్యారీ(106) ఔట్ అయ్యాడు. అనంతరం బ్యాటింగ్‌కి వచ్చిన జోష్ ఇంగ్లీస్(32) ఫర్వాలేదనిపించినా.. కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్(13) విఫలమయ్యాడు. దీంతో 83 ఓవర్లలో ఆస్ట్రేలియా 8 వికెట్లు కోల్పోయి 326 పరుగులు చేసింది. క్రీజ్‌లో స్టార్క్(33), లైయన్(0) ఉన్నారు. ఇంగ్లండ్ బౌలింగ్‌లో ఆర్చర్ 3, కార్స్, జాక్స్ చెరి రెండు, టంగ్ 1 వికెట్ తీశారు.