న్యూఢిల్లీ: 2026 ఐపీఎల్ వేలంలో రికార్డు ధర దక్కించుకుని చరిత్ర సృష్టించిన అన్‌క్యాప్డ్ ప్లేయర్ ప్రశాంత్ వీర్ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో మారుమోగిపోతోంది. బుధవారం (డిసెంబర్ 16) ఐపీఎల్ వేలంలో ప్రశాంత్ వీర్ పేరు వేలానికి వచ్చే వరకు అతని గురించి చాలా మందికి పెద్దగా తెలియదు. అయితే, వేలం ప్రారంభమయ్యాక, అతన్ని దక్కించుకోవడానికి ఏకంగా ఐదు జట్లు ఆసక్తి చూపాయి. చివరికి, తీవ్రమైన బిడ్డింగ్ పోటీలో చెన్నై సూపర్ కింగ్స్, వీర్ కోసం భారీగా రూ.14.2 కోట్లు వెచ్చించి సొంతం చేసుకుంది. దీంతో అతను ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ఆటగాడిగా కూడా నయా చరిత్ర సృష్టించాడు. కానీ, ఇండియాలో చాలా మంది క్రికెటర్ల మాదిరిగానే, ప్రశాంత్ కెరీర్‌లో ఇక్కడి దాకా రావడం అంత సులభంగా జరగలేదు.
అతని బాల్య కోచ్ రాజీవ్ గోయల్, 20 ఏళ్ల ప్రశాంత్ 2020లో క్రికెట్‌ను వదిలేయాలనుకున్నాడని వెల్లడించారు. “ఆ సంవత్సరమే అతని తాత మరణించారు. దాంతో ప్రశాంత్ కుటుంబం తమ ఏకైక ఆదాయ వనరును కూడా కోల్పోయింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో శిక్షా మిత్ర (పారా-టీచర్లు/సబ్-టీచర్లు)గా పనిచేస్తున్న అతని తండ్రి జీతం, కుటుంబ ఖర్చులకు సరిపోకపోయేవి. తన తాత లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుండి వచ్చే పెన్షన్ ప్రశాంత్ క్రికెట్ ఆశయాలను నిలబెట్టింది” అని తెలిపారు. అయితే, ప్రశాంత్ ఖర్చులను చూసుకుని, ఈ రోజు అతను ఈ స్థాయి క్రికెటర్‌గా ఎదగడానికి శిక్షణ ఇచ్చింది కోచ్ గోయలే. ఈ విషయాన్ని ప్రశాంత్ వీర్ వెల్లడించారు.
వేలం తర్వాత ఓ ఇంటర్వ్యూలో ప్రశాంత్ వీర్ మాట్లాడుతూ.. ఐదేళ్ల క్రితం తన తాత మరణించినప్పుడు.. కోచ్ రాజీవ్ గోయల్ తనకు ఆర్థికంగా, మానసికంగా సహాయం చేశారని చెప్పాడు. “సవాళ్లు ఉన్నాయి, కానీ నా కుటుంబం ఎప్పుడూ నా క్రికెట్‌కు, కలలకు ప్రాధాన్యత ఇచ్చింది. వారు నన్ను ఎప్పుడూ అసమర్థుడిని అని భావించనివ్వలేదు. నా తాతగారు మరణించిన తర్వాత కూడా, రాజీవ్ గోయల్ సార్ వంటి వారు నాకు ఆర్థికంగా, మానసికంగా మద్దతు ఇచ్చారు. ఈ ప్రయాణంలో అలాంటి మంచి వ్యక్తులను కలవడం నా అదృష్టంగా భావిస్తున్నాను” అని చెప్పాడు.
ఇక, ప్రశాంత్ బ్యాటింగ్ విషయానికొస్తే.. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన యూపీ టీ20 లీగ్‌లో ప్రశాంత్ వీర్ ప్రదర్శన ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించింది. ఆ టోర్నమెంట్‌లో నోయిడా కింగ్స్‌కు నాయకత్వం వహించిన ప్రశాంత్.. 10 మ్యాచ్‌లలో 155.34 స్ట్రైక్ రేట్‌తో 320 పరుగులు చేసి, ఎనిమిది వికెట్లు కూడా పడగొట్టాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా అదే ఫామ్‌ను కొనసాగించి, 169.69 స్ట్రైక్ రేట్‌తో 112 పరుగులు చేశాడు. 6.76 ఎకానమీ రేట్‌తో తొమ్మిది వికెట్లు కూడా పడగొట్టాడు.