నేషనల్ హెరాల్డ్ కేసుపై కాంగ్రెస్ పార్టీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని బిజెపి విమర్శించింది. ఢిల్లీలోని ట్రయల్ కోర్టు రూలింగ్‌పై తప్పుడు ప్రచారానికి దిగుతోందని బిజెపి జాతీయ ప్రతినిధి గౌరవ్ భాటియా బుధవారం ఇక్కడ చెప్పారు. ఛార్జీషీట్‌ను పరిగణనలోకి తీసుకోవడం లేదని కోర్టు తెలిపింది. అంతేకానీ కేసును కొట్టివేయలేదని , కేసు ఉండనే ఉందని గౌరవ్ వ్యాఖ్యానించారు. కేసు పెండింగ్‌లో ఉందని , ఇడి దర్యాప్తు కొనసాగించవచ్చునని న్యాయస్థానం తెలిపిందని గుర్తు చేశారు. ఏదో చిన్న సాంకేతిక అంశంతో ఛార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకోలేదని , ఇదే విషయాన్ని స్పష్టం చేశారని బిజెపి గుర్తు చేసింది. అయితే కోర్టు రూలింగ్‌ను కాంగ్రెస్ వక్రీకరిస్తోందని బిజెపి స్పందించింది.
నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా నెంబరు 1 , రాహుల్ రెండో ముద్దాయిగా ఉన్నారని , ఈ విషయం అందరికీ తెలిసిందే అని , కేసు నిలిపివేత జరిగిందనే రీతిలో ప్రచారానికి దిగడం పార్టీ దుందుడుకు వైఖరి అని విమర్శించారు. కాంగ్రెస్ నేత పవన్ ఖేరా మితిమీరి పోయి గ్యాంగ్స్ ఆఫ్ గాంధీనగర్ అని వ్యాఖ్యానాలకు దిగడం గర్హనీయం అని బిజెపి తెలిపింది. ముందు కాంగ్రెస్ నేతలు తాము వాడే భాషను చక్కదిద్దుకోవల్సి ఉందని బిజెపి ప్రతినిధి చురకలకు దిగారు. గాంధీనగర్‌లోని ప్రతి భారతీయుడు ఇటువంటి వ్యాఖ్యలతో కలత చెందుతున్నారని, కాంగ్రెస్ పార్టీకి ప్రజల మనోభావాలంటే ఇంత చులకనా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు తమ భాష మార్చుకోకపోతే ప్రజలు కాంగ్రెస్ వారిని ఇటలీ బందిపోట్లు అని తిట్టిపోస్తారని అన్నారు.