హైదరాబాద్: రాష్ట్రంలో బుధవారం (డిసెంబర్ 17) మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరుగుతుంది. తర్వాత మధ్యా హ్నం 2తర్వాత ఓట్ల లెక్కింపు చేస్తారు. మూడో దశలో పోలింగ్ కోసం 36,483 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ విడతలో 182 మండలాలలో 4,159 సర్పంచి స్థానాలకు, 36, 452 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగాల్సి ఉండగా, అందులో 394 సర్పంచి స్థానాలు, 7,908 వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి.
కాగా, 11 సర్పంచి స్థానాలకు, 116 వార్డు స్థానాలకు నామినేషన్లు దాఖలు కాలేదు. 2 సర్పంచి స్థానాలు, 18 వార్డు స్థానాల ఎన్నికలపై స్టే ఉంది. మిగిలిన 3,752 సర్పంచి స్థానాలకు, 28,410 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. కాగా, సర్పం చ్ స్థానాలకు 12,652 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా, వార్డు స్థానాలకు 75,725 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. మూడో విడతలో 53,06,401 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.