తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా పలు మండలాల్లో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఎన్నికల నేపథ్యంలో ఓటు వేసేందుకు ప్రజలు తమ సొంతూర్లకు చేరుకుంటున్నారు. అయితే, మహబూబ్‌నగర్ జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు 7 గ్రామాలు దూరంగా ఉన్నాయి. అమ్రాబాద్ మండలంలోని నల్లమల్ల షెడ్యూల్ ప్రాంతంలో ఓటర్లు లేకున్నా ఎస్టీ రిజర్వేషన్ కేటాయించారు. ఈ క్రమంలో నామినేషన్లు దాఖలు కాకపోవడంతో ఏడు గ్రామాలు ఎన్నికలు జరగడం లేదు.
కాగా, ఇవాళ ఉదయం 7 గంటలకు ప్రారంభమైన మూడో దశ పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతుంది. తర్వాత మధ్యా హ్నం 2 నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుంది. మూడో దశలో పోలింగ్ కోసం 36,483 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ విడతలో 182 మండలాల లో 4,159 సర్పంచి స్థానాలకు, 36, 452 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగాల్సి ఉండగా, అందులో 394 సర్పంచి స్థానాలు, 7,908 వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి.