దేశంలో బాక్సైట్ నిక్షేపాలు ఉన్నా, అవసరాల రీత్యా దేశం లోకి దిగుమతి అవు తున్నది. ముఖ్యంగా చైనా, రష్యా, యుఎఇ, ఇతర దేశాల నుంచి బాక్సైట్ లేదా అల్యూమినా దిగుమతి జరుగుతున్నది. ఫలితంగా దేశ పరిశ్రమాధిపతులు తమ లాభాలు తగ్గుతాయని ఆందోళన చెందుతున్నారు. ఆ ఆందోళనలో భాగమే, దేశీయ పరిశ్రమలను కాపాడాలంటూ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ మినరల్ ఇండస్ట్రీస్ (ఫెమి) కేంద్ర ఆర్థిక శాఖను కోరింది. 2025- 26 ఆర్థిక సంవత్సరం అల్యూ మినియం డిమాండ్‌లో 55% దిగుమతులతోనే భర్తీ అయ్యే పరిస్థితి ఉన్నట్లు ఆర్థిక శాఖకు తెలిపింది. ప్రాథమిక అల్యూమినియంతోపాటు అల్యూమినియం డేన్ స్ట్రీమ్ ఉత్పత్తుల (షీట్లు, ఫాయిల్స్, రాడ్లు) దిగుమతులపై ప్రస్తుతం ఉన్న 7.5% నుంచి 15% సుంకం విధించాలని ఆర్థిక శాఖను కోరింది. అల్యూమినియం సెకండరీ మాన్యుఫ్యాక్టర్స్ అసోషియేషన్ (ఎఎస్ ఎంఎ) మాత్రం ప్రైమరీ అల్యూమినాపై దిగుమతి సుంకాన్ని తగ్గించాలని కోరింది.
భారతదేశంలో బాక్సైట్ అపారంగా ఉంది. 3 వేల మిలియన్ టన్నుల నిల్వలతో, ప్రపంచంలోనే ఎక్కువ నిల్వలు ఉన్న దేశాల్లో 5వ స్థానంలో ఉంది. ఒడిశా, చత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, గుజరాత్ మొదలైన రాష్ట్రాల్లో బాక్సైట్ నిక్షేపాలు ఉన్నాయి. ఒడిశా రాష్ట్రంలోనే 51% పైగా బాక్సైట్ ఉంది. అల్యూమినియం ఉత్పత్తిలో బాక్సైట్ కీలకం. బాక్సైట్ నుంచి అల్యూమినా ముడి పదార్ధం తయారు అవుతుంది. అల్యూమినా ద్వారా అల్యూమినియం తయారు చేస్తారు. భారతదేశంలో తయారయ్యే ఉత్పత్తిలో దాదాపు 40% అమెరికాకు ఎగుమతి జరుగుతున్నది. భారతదేశ అల్యూమినియం అమెరికాకు అగ్ర మార్కెట్ ఉంది. 2023లో భారత అల్యూమినియం మార్కెట్ విలువ 11.29 మిలియన్ల అమెరికా డాలర్లు. ఇది భారత జిడిపిలో 2% గా ఉంది. అల్యూమినియంకు ప్రపంచంలో మంచి డిమాండ్ ఉంది. దీన్ని విమానాల తయారీలోనూ, పరిశ్రమలు, ప్యాక్ జింగ్, ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్ వంటి వాటి తయారీలో వాడతారు. బాక్సైట్‌ను ప్రధానంగా ఆస్ట్రేలియా, చైనా, గినియా, బ్రెజిల్, భారత్ దేశాలతోపాటు ఇండోనేషియా, రష్యా, జమైకా, కజకిస్తాన్, వియత్నాం తదితర దేశాలు ఉత్పత్తి చేస్తున్నాయి.
ప్రపంచంలో ఆల్కొవా, రియో టెంట్, హైడ్రా, ఎస్‌ఎంబి విన్నింగ్ కన్సార్టియం, అల్యూమినియం కార్పొరేషన్ ఆఫ్ చైనా, కంపెనీ డెస్ బాక్సైట్ గినియా, భారత్ అల్యూమినియం కంపెనీ, రామిన్ మైనింగ్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్‌లు పెద్ద మైనింగ్ కంపెనీలు. భారతదేశంలో హిందూస్తాన్ అల్యూమినియం కంపెనీ, వేదాంత లిమిటెడ్, ఇండియా ఫాయిల్స్ లిమిటెడ్, సచేటా మెటల్స్, జిందాల్ అల్యూమినియం, నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్, భారత్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్, మద్రాస్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్, ఇండియన్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్, సెంచరీ ఎక్స్ ట్రూషన్స్ లిమిటెడ్ అల్యూమినియం కంపెనీలు ఉత్పత్తి కంపెనీలుగా ఉన్నాయి. అల్యూమినియం ధరలు బాగా పెరగడంతో ప్రపంచ కంపెనీలతో పాటు, భారత కంపెనీలకు పెద్ద ఎత్తున లాభాలు వస్తున్నాయి. ఆదిత్య బిర్లాకు చెందిన ప్లాగ్ షిప్ మెటల్ కంపెనీ ప్రపంచం లోనే అతిపెద్ద అల్యూమినియం కంపెనీల్లో ఒకటి. దీని ఆదాయం 28 బిలియన్ డాలర్లుగా ఉంది. కాఫర్, స్పెషాల్టీ అల్యూమినా లో కూడా ఈ కంపెనీ బలంగా ఉంది. పది దేశాల్లో 48 ఫ్యాక్టరీలు కలిగి ఉంది. గత మూడు సంవత్సరాల్లో దీని అమ్మకాలు 69 శాతానికిపెరిగి లాభాలు 4.1% ఉన్నాయి. వేదాంత అనుబంధ సంస్థ అయిన వేదాంత అల్యూమినియం భారత్ అతిపెద్ద, ప్రపంచంలో టాప్ అల్యూమినియం కంపెనీల్లో ఉంది. 2025లో భారత్ మొత్తం అల్యూమినియం ఉత్పత్తిలో సగం ఉత్పత్తి దీని నుంచే ఉంది. ఆ సంవత్సరం 2.42 మిలియన్ టన్నుల ఉత్పత్తి చేసింది. గత మూడు సంవత్సరాల్లో అమ్మకాలు 4.8% పెరిగాయి. నాల్కొ- ఇది నవరత్న హోదా కలిగిన ప్రభుత్వ కంపెనీ. బాక్సైట్ మైనింగ్, అల్యూమినా, అల్యూమినియంకి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహిస్తుంది. దీని బాక్సైట్ కెపాసిటీ సామర్థ్యం ఏడాదికి 68 లక్షల టన్నులుగా ఉంది. అల్యూమినా సామర్థ్యం 21 లక్షల టన్నులుగా ఉంది. 2025లో దీని నికర లాభం 158% పెరిగి రూ. 52,679 కోట్లకు చేరిందని, సంపద 1,67,876 కోట్లకు పెరిగింది.
దేశంలో బాక్సైట్ నిక్షేపాలు ఉన్నా, అవసరాల రీత్యా దేశం లోకి దిగుమతి అవుతున్నది. ముఖ్యంగా చైనా, రష్యా, యుఎఇ, ఇతర దేశాల నుంచి బాక్సైట్ లేదా అల్యూమినా దిగుమతి జరుగుతున్నది. ఫలితంగా దేశ పరిశ్రమాధిపతులు తమ లాభాలు తగ్గుతాయని ఆందోళన చెందుతున్నారు. ఆ ఆందోళనలో భాగమే, దేశీయ పరిశ్రమలను కాపాడాలంటూ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ మినరల్ ఇండస్ట్రీస్ (ఫెమి) కేంద్ర ఆర్థిక శాఖను కోరింది. 2025- 26 ఆర్థిక సంవత్సరం అల్యూమినియం డిమాండ్‌లో 55% దిగుమతులతోనే భర్తీ అయ్యే పరిస్థితి ఉన్నట్లు ఆర్థిక శాఖకు తెలిపింది. ప్రాథమిక అల్యూమినియంతోపాటు అల్యూమినియం డేన్ స్ట్రీమ్ ఉత్పత్తుల (షీట్లు, ఫాయిల్స్, రాడ్లు) దిగుమతులపై ప్రస్తుతం ఉన్న 7.5% నుంచి 15% సుంకం విధించాలని ఆర్థిక శాఖను కోరింది. అల్యూమినియం సెకండరీ మాన్యుఫ్యాక్టర్స్ అసోషియేషన్ (ఎఎస్ ఎంఎ) మాత్రం ప్రైమరీ అల్యూమినాపై దిగుమతి సుంకాన్ని తగ్గించాలని కోరింది. దేశంలో అల్యూమినియం ధరల స్థిరీకరించడానికి, అధిక ఇన్‌పుట్ ఖర్చులతో ఇబ్బందిపడుతున్న దిగువ స్థాయి పరిశ్రమలకు అవసరమైన ఉపశమనం అందించడానికి ప్రైమరీ అల్యూమినాపై దిగుమతి సుంకాన్ని తగ్గించమని తెలిపింది. ఇది బడా పరిశ్రమలు, చిన్న పరిశ్రమల మధ్య ఉన్న వైరుధ్యాన్ని తెలియ చేస్తున్నది. బడా పరిశ్రమల వల్ల చిన్న పరిశ్రమలు నష్ట పోతున్న విషయాన్ని ఇది పరోక్షంగా తెలిపింది.
ఆంధ్రప్రదేశ్‌లో 600 మిలియన్ టన్నుల బాక్సైట్ ఉంది. జియో లాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం దేశం మొత్తం నిల్వల్లో ఇది 21%. ఇందులో విశాఖపట్నం తూర్పు కనుముల్లోనే ఎక్కువగా ఉంది. 2000 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ పాలనలో రాష్ట్రంలోని బాక్సైట్ వనరులను బయటకు తీసేందుకు ప్రణాళికలు రూపొందించింది. అప్పటి నుండి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గిరిజన ప్రజల భూహక్కులను, షెడ్యూల్డ్ ప్రాంతం లో రాజ్యాంగ రక్షణను నియంత్రించే చట్టాలకు సవరణలు చేయడానికి పూనుకుని, గిరిజనులు, గిరిజన సంఘాల తీవ్ర వ్యతిరేకత వల్ల ఆ ప్రయత్నాలను విరమించుకున్నారు. 2004లో అధికారంలోకి వచ్చిన ఆనాటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం బాక్సైట్‌ను తవ్వే పనిని చేపట్టింది. 2005 లో జెఎస్‌డబ్లు హెచ్‌ఎల్‌తో, తదుపరి 2007లో రస్ ఆల్ కైమాతో ఒప్పందం కుదుర్చుకున్నది. 1997లో సుప్రీం కోర్టు సమతా తీర్పు ప్రకారం రాష్ట్రంలోని షెడ్యూల్డ్ ప్రాంతంలో గనులు లేదా పరిశ్రమలకోసం ఏ ప్రైవేట్ కంపెనీ భూమిని స్వాధీనం చేసుకోకుండా లేదా లీజుకు ఇవ్వకుండా నిరోధించడం వల్ల రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం మోస పూరితంగా తవ్వకాలను చేపట్టింది.
ప్రభుత్వ సంస్థ అయిన ఆం.ప్ర ఖనిజాభివృద్ధి (ఎపిఎండిసి) సంస్థ బాక్సైట్ ని తవ్వుతుంది. దాన్ని ప్రభుత్వం రస్ ఆల్ కైమాకి సరఫరా చేస్తుంది. ఆ సంస్థకు 11 వందల ఎకరాలకు పైగా భూమిని కేటాయించింది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా గిరిజనులు, ప్రజా సంఘాలు పెద్దఎత్తున ఆందోళన చేశాయి. ఆ నేపథ్యంలో ఎన్నికలు రావడంతో బాక్సైట్ తవ్వకాలు ఆగిపోయింది. వైసిపి ప్రభుత్వం 2020 డిసెంబర్ లో జిఒ 89 విడుదల చేసి, బాక్సైట్ తవ్వకాలు చేసేందుకు ప్రయత్నించగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర నిరసనలు కొనసాగాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల కన్నా చాలా తక్కువ బాక్సైట్ నిల్వలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో బాక్సైట్ అన్వేషణ కొనసాగుతున్నది. నేటి ఎపి కూటమి ప్రభుత్వం కూడా ఖనిజాల తవ్వకాలకు పారిశ్రామిక వేత్తలకు అనుమతులు ఇచ్చే ఆలోచన చేస్తున్నది. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ముఖ్యంగా ఒడిశా, గుజరాత్, జార్ఖండ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో బహుళ జాతి సంస్థలు కూడా బాక్సైట్ తవ్వకాలు చేపట్టగా, స్థానికుల వ్యతిరేకత, పర్యావరణ అనుమతులు లేకపోవడం వల్ల కొన్ని ప్రాజెక్టులు ఆగిపోయాయి. మోడీ ప్రభుత్వం అటవీ హక్కుల పరిరక్షణ చట్టానికి చేసిన సవరణలుద్వారా బహుళ జాతి సంస్థలు బాక్సైట్ తవ్వకాలకు అటవీ భూములు పొందే హక్కులు కల్పించింది.
బాక్సైట్ తవ్వకాలు గిరిజనుల మనుగడనే ప్రశ్నార్థకం చేస్తున్నది. వారి సమస్యలు ఏమాత్రం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పట్టడం లేదు. బాక్సైట్‌ను బడా సంస్థలకు కట్టబెట్టటమే విధానంగా వ్యవహరిస్తున్నాయి. బాక్సైట్ తవ్వకాల వల్ల గిరిజనుల భూములు, వారి జీవనోపాధి పోతుంది. పర్యావరణ కాలుష్యం, ఆరోగ్య సమస్యలు ఏర్పడటమే కాకుండా గిరిజనుల సంస్కృతి, సాంప్రదాయాలు విధ్వంసానికి లోనవుతాయి. మైనింగ్ వల్ల అడవులు నాశనమై నీటి వనరులు దెబ్బతిని పంటలకు నష్టం జరుగుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే తరతరాలుగా అడవితో పెనవేసుకొన్న గిరిజనుల జీవితం అడవికి దూరమవుతుంది. పెసా, అటవీ హక్కుల చట్టాల వంటి గిరిజనుల రక్షణ చట్టాలను మోడీ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు పక్కన పెట్టి బాక్సైట్ మైనింగ్ తవ్వకాలు జరపడమే కాకుండా, బడా దేశీయ, విదేశీ సంస్థల తవ్వకాలకు అనుమతిస్తున్నాయి. బాక్సైట్ తవ్వకాలు దేశ అవసరాలకు పరిమితమై, గిరిజనుల జీవనానికి, పర్యావరణ పరిరక్షణకు హాని కలగకుండా జరగాలి. ప్రభుత్వ రంగ సంస్థలే ఆ పని చేయాలి. బాక్సైట్ తవ్వకాల్లోనూ, అల్యూమినా ఉత్పత్తి లోను బడా కంపెనీల ప్రయోజనాలు కాపాడుతూ, గిరిజనుల జీవితాలను ఛిన్నాభిన్నం చేయ చూస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా గిరిజనులతో చేయి కలిపి రాష్ట్ర ప్రజలు ఉద్యమించాలి.
బొల్లిముంత సాంబశివరావు
9885983526