వారంలో నాలుగు రోజులు, నెలలో పదహారు దినాలే పనిదినాలైతే ఎలా ఉంటుంది? ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ కొత్త విధానాన్ని అమలులోకి తేబోతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉద్యోగవర్గాలలో చర్చోపచర్చలు సాగుతున్నాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పాతకాలంనాటి 29 కార్మిక చట్టాలను రద్దు చేసి, వాటి స్థానంలో నాలుగు కొత్త లేబర్ కోడ్లను అమలులోకి తెచ్చింది. ఈ లేబర్ కోడ్లు వారానికి నాలుగు రోజుల పనివిధానానికి అనుమతి ఇస్తున్నాయి. ప్రస్తుతం వారానికి ఐదు రోజులు పనిచేసే సాఫ్ట్ వేర్ కంపెనీలను మినహాయిస్తే, మిగిలినవాటిలో ఉద్యోగులు రోజుకు ఎనిమిది గంటల చొప్పున, వారంలో ఆరు రోజులపాటు.. అంటే 48 గంటలసేపు పనిచేస్తున్నారు. కొత్త చట్టాల ప్రకారం ఇదే పనిని నాలుగు రోజుల్లో చేయవలసి ఉంటుంది. అంటే రోజుకు 12గంటలు పనిచేయాలన్నమాట. అంతకుమించి పనిచేస్తే రెట్టింపు వేతనం ఇవ్వాలన్న నిబంధన కూడా ఈ కొత్త చట్టాలలో ఉంది. కొత్త పనిదినాల వల్ల నాలుగు రోజులు పనిచేస్తే, మూడు రోజులు సెలవు దొరుకుతుందన్న అభిప్రాయం మెజారిటీ ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది. ఈ నిబంధనలన్నీ ఆయా కంపెనీలకు, ఉద్యోగులకూ ఐచ్ఛికమేనని ప్రభుత్వం పేర్కొనడం ఆహ్వానించదగిన పరిణామం. యాజమాన్యం, ఉద్యోగులు ఏకతాటిపైకి వచ్చి నాలుగురోజుల పనిదినాలకు సరేనంటే ముందుకు వెళ్లవచ్చు. లేదా పాత పద్ధతిలోనే కొనసాగవచ్చు. రోజంతా నిరంతరాయంగా పనిచేయవలసి వచ్చే కార్యాలయాలకు, ప్రజలతో ప్రత్యక్షంగా సంబంధం ఉండే కార్యాలయాలకు ఈ పనివేళలు పనికిరావనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.
వాస్తవానికి కరోనా అనంతరం యాజమాన్యాలు, ఉద్యోగుల ఆలోచనా విధానంలో మార్పు వచ్చింది. కరోనా అనంతరం సాఫ్ట్‌వేర్ కార్యాలయాల యాజమాన్యాలు తమ ఉద్యోగులు వారానికి రెండు లేదా మూడు రోజులు కార్యాలయానికి వచ్చి పనిచేస్తే చాలంటున్నాయి. ఆ మధ్య జీనియస్ కన్సల్టెంట్ అనే సంస్థ మన దేశంలో నాలుగు రోజుల పనివిధానంపై చేపట్టిన అధ్యయనంలో మెజారిటీ ఉద్యోగులు దీనిపట్ల మక్కువ కనబరిచారు. పనివేళలు మన చేతిలో ఉంటే వృత్తిగత జీవితానికీ, వ్యక్తిగత జీవితానికీ న్యాయం చేయవచ్చుననే అభిప్రాయం వారిలో వ్యక్తమయింది. మన దేశానికి కొత్త కావచ్చునేమో గానీ, అమెరికా, జపాన్, స్పెయిన్, ఐస్లాండ్, స్కాట్లాండ్ వంటి దేశాల్లోని అనేక కంపెనీల్లో నాలుగు రోజుల పనివిధానం ఎప్పటినుంచో అమలులో ఉంది. ఈ కంపెనీలు మరిన్ని వెసులుబాట్లు కూడా కల్పిస్తున్నాయి. ఒక ఉద్యోగి రోజులో ఎప్పుడైనా వచ్చి పనిచేయవచ్చు. మధ్యలో కావాలంటే బయటకు వెళ్లిరావచ్చు. ఆ రోజు మొత్తంలో 12 గంటలు పనిచేయటం, వారాంతానికి 48 గంటల పని పూర్తి చేయడం ముఖ్యం. ఈ రకమైన విధానంవల్ల ఇంటిపనులు, పిల్లల పోషణ, వారిని పాఠశాలలో దిగబెట్టడం, ఇంటికి తీసుకురావడం వంటి పనులను చేసుకునే వీలు కలుగుతుంది. ముఖ్యంగా మహిళా ఉద్యోగులకు ఈ వెసులుబాట్లు ప్రయోజనకరంగా ఉంటాయి. అంతేకాదు, ఈ రకమైన పనివిధానం వాహన కాలుష్యానికీ, ట్రాఫిక్ సమస్యకూ కొంతవరకూ పరిష్కారంగా చెప్పుకోవచ్చు. నిజానికి పని వేళలపై మన దేశంలో కొంతకాలంగా చర్చ జరుగుతోంది. ఉద్యోగులు వారానికి 90 గంటలు పనిచేయాలని, ఆదివారాలు కూడా పనిదినాలేనంటూ ఎల్‌అండ్ టి చైర్మన్ సుబ్రమణియన్ అంటే, అంతకంటే ముందు ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి ఉద్యోగులు వారానికి 70 గంటలు పనిచేయాలంటూ ప్రతిపాదించారు.
ఈ ఇద్దరు ప్రముఖులు వ్యక్తం చేసిన అభిప్రాయాలపై చర్చ నడుస్తుండగానే, కొత్త లేబర్ కోడ్లు అమలులోకి వచ్చాయి. నాణేనికి బొమ్మాబొరుసూ ఉన్నట్లే నాలుగు గంటల పని విధానంలోనూ సమస్యలు లేకపోలేదు. మధ్యలో ఎంత విరామం తీసుకున్నా, ఒక రోజులో పన్నెండు గంటలు పనిచేయడమంటే శారీరిక, మానసికపరమైన సమస్యలకు లోనయ్యే ప్రమాదం ఉంటుంది. రోజుకు గంటల తరబడి పనిచేసే సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు నిద్రలేమి, మెడ, వెన్నెముక వంటి చోట్ల నొప్పులు, పని ఒత్తిడి వల్ల తలెత్తే మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు అనేక అధ్యయనాల్లో తేలిందన్న సంగతి విస్మరించకూడదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన ఒక సర్వేలో ఉద్యోగులలో డిప్రెషన్, మానసికపరమైన ఆందోళనవంటి సమస్యల కారణంగా ఏటా కొన్ని కోట్ల పనిదినాల నష్టం జరుగుతున్నట్లు తేలింది. కాబట్టి రోజుకు పనివేళలతోపాటు వారంలో ఎన్ని రోజులు పనిచేయాలో ఎంచుకునే వెసులుబాటు కూడా ఉద్యోగులకు ఇవ్వడం సముచితంగా ఉంటుంది.