“నేను పార్టీ మారలేదు సార్..’ అని బిఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించారన్న ఆరోపణ ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు వివరణ ఇచ్చారు. బుధవారం కడియం శ్రీహరి స్పీకర్‌ను కలిసి ఈ మేరకు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. తనపై కావాలనే బురద చల్లుతున్నారని ఆయన పేర్కొన్నారు. తాను పార్టీ ఫిరాయించారనడం పచ్చి అబద్దమని ఆయన తెలిపారు.బిఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన కడియం శ్రీహరి కొంత కాలం తర్వాత కాంగ్రెస్‌లో చేరారన్న అభియోగాన్ని ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా ఆయనపై స్పీకర్‌కు, సుప్రీం కోర్టులో ఇదివరకే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
ఇదిలాఉండగా స్పీకర్ ప్రసాద్ కుమార్ బుధవారం అనూహ్యంగా ఐదుగురు ఎమ్మెల్యేలపై దాఖలైన పిటిషన్లను తిరస్కరిస్తూ పార్టీ ఫిరాయించినట్లు తమకు ఎటువంటి సాక్షాధారాలు చూపించలేదని తీర్పునిచ్చారు. ఈ నేపథ్యంలోనే కడియం శ్రీహరి, దానం నాగేందర్‌లపై స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఉత్కంఠ నెలకొన్నది. మరోవైపు దానం నాగేందర్, కడియం శ్రీహరి తమకు వివరణ ఇచ్చేందుకు మరి కొంత గడువు కావాలని స్పీకర్‌ను కోరినట్లు ప్రచారం జరుగుతుండగా, కడియం శ్రీహరి స్పీకర్‌ను కలిసి తాను పార్టీ ఫిరాయించలేదని లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు.