హైదరాబాద్: పార్టీ ఫిరాయించిన ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఇవాళ(బుధవారం, డిసెంబర్ 17) కీలక తీర్పు రానుంది. ఈరోజు మధ్యాహ్నం 3.౩౦ గంటలకు స్పీకర్.. ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తీర్పు ప్రకటించనున్నారు. ఇప్పటికే ఫిరాయింపు ఎమ్మెల్యేల అడ్వకేట్లకు స్పీకర్ కార్యాలయం నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. దీంతో అరికెపూడి గాంధీ, తెల్లం వెంకట్రావ్, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్‌రెడ్డి అనర్హత పిటిషన్లపై స్పీకర్ ఫైనల్ నిర్ణయం తీసుకోనున్నారు.
కాగా, 2023లో బిఆర్ఎస్ పార్టీ తరుఫున పోటీ చేసి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు.. అధికార పార్టీ కాంగ్రెస్ లోకి వెళ్లారు. దీంతో బిఆర్ఎస్.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీంతో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాలని సుప్రీ కోర్టు.. తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను ఆదేశించింది. ఈ క్రమంలో స్పీకర్ వివరణ కోరుతూ.. మొదట ఈ ఐదుగురు ఎమ్యెల్యేలకు నోటీసులు జారీ చేశారు. దీంతో స్పీకర్ ఏం నిర్ణయం తీసుకోబోతున్నారోనని ఉత్కంఠ నెలకొంది.