బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఉన్న ఇండియన్ వీసా అప్లికేషన్ సెంటర్ (ఐవిఏసి) ని భారతదేశం మూసివేయాలని బుధవారం నాడు నిర్ణయించింది. తీవ్రవాద శక్తుల బెదిరింపులు, బంగ్లాదేశ్ నాయకుల రెచ్చగొట్టే వ్యాఖ్యల నేపథ్యంలో పెరుగుతున్న భద్రతా సమస్యల కారణంగా భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్ రాజధానిలో ప్రధానంగా భారత వీసా సేవలు అందించే కేంద్రం ఢాకాలోని జమునా ఫ్యూచర్ పార్క్ లో ఉంది. దీనిని ఇండియన్ వీసాఅప్లికేషన్ సెంటర్ గా వ్యవహరిస్తారు. భద్రతా పరమైన కారణాలను పేర్కొంటూ బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు తన కార్యకలాపాలను మూసివేసింది. బుధవారం షెడ్యూల్ ప్రకారం అపాయింట్ మెంట్ ఇచ్చిన దరఖాస్తుదారులకు మళ్లీ మరో తేదీన అవకాశం ఇస్తామని ఐవిఏసి ఒక ప్రకటనలో తెలిపింది.
బుధవారం ఉదయం న్యూఢిల్లీ లోని విదేశాంగ మంత్రిత్వశాఖ భారతదేశంలోని బంగ్లాదేశ్ హై కమిషనర్ ఎం. రియాజ్ హమీదుల్లాను పిలిపించి, బంగ్లాదేశ్ లో క్షీణిస్తున్న భద్రతా వాతావరణం, పై భారతదేశపు తీవ్ర ఆందోళనను తెలియజేసింది. ఢాకా లోని భారత హై కమిషన్ చుట్టూ తీవ్రవాద శక్తుల కార్యకలాపాలు, వారు సృష్టిస్తున్న వాతావరణం పై అతడి దృష్టికి తెచ్చినట్లు మంత్రిత్వశాఖ తెలిపింది. బంగ్లాదేశ్ లో ఇటీవల జరిగిన కొన్ని సంఘటనపై ఉగ్రవాద శక్తులు సాగిస్తున్న తప్పుడు ప్రచారాన్ని భారతదేశం తిరస్కరిస్తున్నట్లు విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఈ సంఘటనలపై సమగ్ర దర్యాప్తు నిర్వహించలేదని, భారతదేశానికి అందుకు సంబంధించిన ఆధారాలను పంచుకోలేదని పేర్కొంది.
బంగ్లాదేశ్ రాజకీయనాయకుడు భారతదేశంపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు బెదిరింపు లకు పాల్పడడంతో బుధవారం నాడు విదేశాంగ మంత్రిత్వశాఖ బంగ్లాదేశ్ రాయబారిని పిలిపించింది. బంగ్లాదేశ్ నేషనల్ సిటిజన్ పార్టీ (ఎన్ సిపి) నాయకుడు హస్నాత్ అబ్దుల్ సోమవారం ఒక ర్యాలీలో భారత్ పై తీవ్ర విమర్శలు చేస్తూ, బంగ్లాదేశ్ ను అస్థిరపరిస్తే, తమదేశం సెవెన్ సిస్టర్స్ అని పిలిచే భారత ఈశాన్యరాష్ట్రాలలో చిచ్చుపెడతామని, వేర్పాటు వాదులకు ఆశ్రయం కల్పించే ప్రయత్నంచేస్తుందని హెచ్చరించారు. ఇదిలా ఉండగా, బంగ్లాదేశ్ ఢాకాలోని భారత హైకమిషనర్ ను పిలిపించి, మాజీ ప్రధాని షేక్ హసీనాను త్వరగా అప్పగించాలని డిమాండ్ చేసింది.