అల్వార్: రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అల్వార్‌లోని ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై ఓ పికప్ వాహనం.. పలు వాహనాలను ఢీకొట్టింది. దీంతో పికప్ వాహనంలో మంటలు చెలరేగి దగ్ధమైంది. ఈ ఘటనలో వాహనంలో ఉన్న ముగ్గురు వ్యక్తులు సజీవదహనమైనట్లు తెలుస్తోంది. మరోక వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. మంగళవారం రాత్రి రేణి పోలీస్ స్టేషన్ ప్రాంతం సమీపంలో ఈ సంఘటన జరిగింది. ఢిల్లీ నుండి జైపూర్‌కు వెళ్తుండగా పికప్ వాహనం ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో డ్రైవర్ తీవ్ర గాయాలపాలయ్యాడు. చికిత్స కోసం అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం జైపూర్‌కు తరలించారు.
ఈ ప్రమాదంలో మరణించిన వారిని హర్యానాలోని బహదూర్‌గఢ్ నివాసి మోహిత్, మధ్యప్రదేశ్‌లోని సాగర్ నివాసి దీపేంద్ర, మధ్యప్రదేశ్‌లోని సాగర్ నివాసి పదమ్‌గా పోలీసులు గుర్తించారు. గాయపడిన డ్రైవర్‌ను హర్యానాలోని ఝజ్జర్ నివాసి హన్నీగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వే ప్రమాదం
కాగా, నిన్న మధురలోని ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై దట్టమైన పొగమంచు కారణంగా జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏకంగా 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏడు బస్సులు, మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నడంతో వాహనాలు మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో మరో 60 మంది గాయపడ్డారు.