గ్రీన్‌కు రూ. 25.25 కోట్లు
పతిరన, లివింగ్‌స్టాన్‌లకు జాక్‌పాట్
ప్రశాంత్, కార్తీక్‌లకు చెరో రూ.14.20 కోట్లు
మినీ వేలంలో క్రికెటర్లపై కనక వర్షం
అబుదాబి: ఐపిఎల్ వేలం పాట క్రికెటర్లపై కనక వర్షం కురిపించింది. 2026 సీజన్ కోసం అబుదాబి వేదికగా మంగళవారం క్రికెటర్ల వేలం పాట జరిగింది. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ వేలంలో కళ్లు చెదిరే ధరకు అమ్ముడుపోయాడు. ఐపిఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన విదేశీ క్రికెటర్‌గా గ్రీన్ నయా చరిత్ర సృష్టించాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్ టీమ్ రూ.25.20 కోట్లను వెచ్చించి గ్రీన్‌ను సొంతం చేసుకుంది. శ్రీలంక స్టార్ ఫాస్ట్ బౌలర్ మతీశ పతిరన కూడా మినీ వేలంలో భారీ ధర పలికాడు. రూ.18 కోట్ల రికార్డు ధరకు కోల్‌కతా ఫ్రాంచైజీ పతిరనను దక్కించుకుంది. అన్‌క్యాప్‌డ్ క్రికెటర్లు ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మలు నయా చరిత్రను లిఖించారు. ఇప్పటి వరకు ఒక్క అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ కూడా ఆడని వీరిని సొంతం చేసుకునేందుకు ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీపడ్డాయి. చివరికి చెన్నై సూపర్ కింగ్స్ ఇద్దరికి చెరో రూ.14.20 కోట్లను వెచ్చించి కొనుగోలు చేసింది. ఇద్దరు కూడా కనీస ధర రూ.30 లక్షలతో వేలం బరిలో దిగారు. కానీ వీరు ఎవరూ ఊహించని విధంగా కళ్లు చెదిరే ధరకు అమ్ముడు పోవడం విశేషం.
లివింగ్‌స్టోన్‌కు రూ.13 కోట్లు
ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు లియామ్ లివింగ్‌స్టోన్ కూడా వేలం పాటలో భారీ ధరను పలికాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ అతన్ని రూ.13 కోట్లకు సొంతం చేసుకుంది. తొలి రెండు రౌండ్‌లలో అన్‌సోల్డ్‌గా మిగిలిన లివింగ్‌స్టోన్‌కు చివరి రౌండ్‌లో అనూహ్యంగా డిమాండ్ పెరిగింది. చివరికి కళ్లు చెదిరే ధరకు సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ దక్కించుకుంది. బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తఫిజుర్ రహ్మాన్ కూడా వేలం పాటలో భారీ ధరకు అమ్ముడు పోయాడు. అతన్ని రూ.9.20 కోట్లకు కోల్‌కతా టీమ్ కొనుగోలు చేసింది. ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు జోష్ ఇంగ్లిస్‌ను రూ.8.6 కోట్లకు లక్నో సూపర్‌జెయింట్స్ ఫ్రాంచైజీ దక్కించుకుంది. అతన్ని సొంతం చేసుకునేందుకు లక్నో, హైదరాబాద్‌లు తీవ్రంగా పోటీపడ్డాయి. చివరికి లక్నో అతన్ని సొంతం చేసుకుంది.
జమ్ము కశ్మీర్ అన్‌క్యాప్‌డ్ ఆటగాడు ఆకిబ్ దార్ కూడా జాక్‌పాట్ కొట్టేశాడు. అతన్ని రూ.8.40 కోట్ల ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. రవి బిష్ణోయ్‌ను రూ.7.20 కోట్లకు రాజస్థాన్ రాయల్స్, విండీస్ ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్‌ను రూ.7 కోట్లకు గుజరాత్, భారత ఆటగాడు వెంకటేశ్ అయ్యర్‌ను రూ.7 కోట్లకు బెంగళూర్ జట్లు దక్కించుకున్నాయి. ఈసారి జరిగిన వేలం పాటలో అన్ని ఫ్రాంచైజీలు కలిపి రూ.2415.45 కోట్లను వెచ్చించాయి. వేలంలో 77 మంది క్రికెటర్లను ఆయా ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి. వీరిలో 29 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు.