జార్ఖండ్‌లోని అంగారా ప్రాంతపు జిదూ గ్రామంలో అడవి ఏనుగుల స్వైర విహారంతో ఐదుగురు వ్యక్తులు బలి అయ్యారు. వాటి ధాటికి మృతి చెందిన వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు.గడిచిన 24 గంటలలో ఈ మదపుటేనుగుల అరాచకంలో ఈ ఘటనలు జరిగాయి. అదుపు తప్పిన ఏనుగులు వేర్వేరు చోట్ల చెలరేగాయి. ఈ క్రమంలో తమ ముందుకు వచ్చిన వారిపై ఘీంకరిస్తూ కిందపడేసి తొక్కివేశాయని అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో మదపుటేనుగుల గుంపు తిరుగుతోంది. పంట పొలాలపై పడి ధ్వంసానికి దిగుతున్నాయి. తరిమికొట్టేందుకు యత్నించే వారిని లేదా తమ కండ్ల ముందుకు వచ్చిన వారిపై దాడికి దిగుతున్నాయని అధికారులు తెలిపారు. ఈ ఏనుగుల మంద కోసం అటవీశాఖాధికారులు గాలిస్తున్నారు. మృతులలో ఇద్దరు ముసలివారైన మహిళలు ఉన్నట్లు వెల్లడైంది. ఇకీ ప్రాంతంలో స్థానికంగా బొగ్గు గనుల కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసే రజ్వార్ ఈ ప్రాంతంలో తిరుగుతున్న ఏనుగుల మంద వీడియో చిత్రీకరించేందుకు , పైగా సెల్ఫీకి దిగేందుకు ప్రయత్నించి చావు కొని తెచ్చుకున్నాడు. ఈ ప్రాంతంలో 42 గజాలు మందలుగా విడిపోయి అడవులు వీడి, పల్లెలపై పడుతున్నాయి. దీనితో అనేక చోట్ల భయాందోళనలు అలుముకున్నాయి.