హైదరాబాద్: ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంలో దాఖలైన పిటిషన్లపై రాష్ట్ర స్పీకర్ ప్రసాద్ కుమార్ తీర్పు వెలువరించారు. తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, అరికెపూడి గాంధీలపై దాఖలైన అనర్హత పిటిషన్లను కొట్టి వేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు ఆధారాలు చూపించలేకపోయారని పేర్కొన్నారు. అనర్హత వేటుకు తగిన ఆధారాలు లేవని, సాంకేతికంగా ఆ ఐదుగురు ఎమ్మెల్యేలు భారత రాష్ట్ర సమితిలోనే ఉన్నట్లు స్పష్టం చేశారు.
మొత్తం పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు దాఖలు చేయగా.. ఎనిమిది మందికి సంబంధించి విచారణ పూర్తి చేశారు. దానం నాగేందర్, కడియం శ్రీహరిపై దాఖలైన పిటిషన్ల విచారణ ఇంకా పూర్తి కాలేదు. అనర్హత పిటిషన్లపై సభాపతి త్వరగా నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ బిఆర్ఎస్ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై ఈనెల 19న మరోమారు విచారణ జరగనుంది. ఎనిమిది మందికి సంబంధించిన విచారణ పూర్తి చేసిన సభాపతి.. ఇవాళ ఐదుగురికి సంబంధించి తీర్పు ఇచ్చారు. పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కాలే యాదయ్య, సంజయ్ కుమార్‌కు సంబంధించి గురువారం తీర్పు వెలువడనుంది.