ఇటీవల బిసిలకు రిజర్వేషన్లు దక్కకపోవడంపట్ల మనస్తాపం చెందిన ఈశ్వరాచారి ఆత్మహత్య చేసుకోవటం ఊహించని సంఘటన. ఇట్లాంటి ఘటనలు వాంఛనీయం కాదు. ఏ సమస్యకైనా ఆత్మహత్యలు పరిష్కారం కానే కాదు. ఇట్లాంటి సంఘటనలు మున్ముందు జరగకుండా జాగ్రత్తపడవలసి బాధ్యత బిసి ఉద్యమకారుల మీదున్నది. బిసి ఉద్యమంపట్ల సరైన వైఖరిని, దాని పంథాను ప్రజలకు వెల్లడి చేయవలసిన చారిత్రక మలుపు దగ్గర ఇప్పుడు బిసి ఉద్యమం ఉంది. జరగవల్సింది కాదు కానీ ఈశ్వరాచారి ఆత్మబలిదానం తర్వాతనయినా బిసిల మిత్రులెవరో, శత్రువులెవరో స్పష్టంగా విభజన రేఖలు గీయవల్సిన సందర్భం ఇది. రాజకీయ పార్టీల ద్వంద్వ వైఖరిని బయటపెట్టి ఎవరు నిజంగా బిసిల కోసం నిలబడగలరో గుర్తించి వారితో ప్రయాణం చేయాలి. బిసి ఉద్యమం తాలూకు గత చరిత్రను బేరీజు వేసుకుని ఇప్పుడు ఎలా ముందుకు వెళ్లాలో అంచనాకు రావాలి. ఈ సమస్య ఒకటి రెండు సంవత్సరాల కాలంలో పరిష్కారమయ్యే చిన్న సమస్య కూడా కాదు. దీనికి మరో తెలంగాణ ఉద్యమంలాంటి ఉద్యమం జరగాలి. తెలంగాణ ఉద్యమం ఎలాగైతే న్యాయబద్ధమైనదో బిసి ఉద్యమం అలాగే న్యాయబద్ధమైన ఉద్యమం. నిజానికి బిసి ఉద్యమం ఒక తెలంగాణకో, ఆంధ్రప్రదేశ్‌కో సంబంధించిన ఉద్యమం కాదు. అది మొత్తం భారతదేశానికి సంబంధించినది.
అన్ని రాష్ట్రాల్లోనూ ఈ ఉద్యమం రావాలి. దానికి సరియైన సమయం కూడా ఇదే. కాబట్టి దేశంలో ఉన్న బిసి మేధావులను కూడా ఇక్కడి ఉద్యమంలో భాగస్వాములను చేసి ఉద్యమానికి సైద్ధాంతిక బలాన్ని అందించే ఏర్పాటు చేయాలి. దీనికి ముందుగా బాధ్యత వహించవల్సింది అన్ని రాజకీయ పార్టీలలో క్రియాశీలక స్థానాల్లో ఉన్న బిసి నాయకులే. ఈ నేపథ్యంలో ఉద్యమాలలోకి యువత రావటమన్నది ఒక అనివార్యత. చరిత్రలో గతంలో జరిగిన అన్ని రకాల ఉద్యమాలు యువత నడిపించినవే. తెలంగాణ ఉద్యమం కూడా యువకుల రంగప్రవేశం తరువాతనే ఉధృతమైన సంగతి అందరి అనుభవంలో ఉన్నదే. అయితే మలిదశ తెలంగాణ ఉద్యమం శ్రీకాంతాచారి బలిదానంతో కొత్తమలుపు తీసుకున్నది. నిజానికి ఆ బలిదానం తర్వాతనే ప్రజలలో ఆనాటివరకు అణిచిపెట్టుకున్న అగ్రహ జ్వాలలు ఒక్కసారిగా పెల్లుబికాయి. తరువాత జరిగిందంతా తెలుగు ప్రజలకు తెలిసిందే. అయితే ఎవరోఒకరు ఆత్మార్పణ చేసుకుంటే తప్ప ఉద్యమంలో కదలిక రాదని భావిస్తే అది పెద్ద తప్పు.
శత్రువులను చంపటం ద్వారా లేదా ఆత్మహత్య చేసుకోవటం ద్వారా ఉద్యమాలను నడపాలనుకోవటం సరియైన పంథా కాదు. ‘బతికి సాధించటం’ అనే విలువను యువతకు నూరిపోయాల్సిన అవసరం ఉద్యమకారుల మీదనే కాదు పౌరసమాజం మీద కూడా ఉన్నది. ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకొని ఉద్యమానికి ఇచ్చే బలం కన్నా ఆ వ్యక్తి బతికి ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషిస్తూ ఇచ్చే బలం గొప్పది. ఈ విషయాన్ని ఉద్యమంలో ఉన్న యువత గుర్తించాలి. తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఈ బలిదానాలకు సంబంధించి ఒక విషయం ప్రజలందరికీ స్పష్టమయింది. ఉద్యమంలో ఆత్మహత్యకు పాల్పడిన వాళ్లలో ఒక్కరు కూడా అగ్రకులాలకు చెందిన వారు లేరు. అలాగే ఏ రాజకీయ పార్టీకి చెందిన ఒక్క ఎంఎల్‌ఎ కానీ, ఎంపి కానీ ఆత్మహత్య చేసుకోలేదు.
స్వార్థప్రయోజనాలతో ఆనాడు నాయకులు రెచ్చగొట్టటంవల్ల నిస్వార్థంగా ఉద్యమంలో ఉన్న యువత ఉద్రేకానికిలోనై ఆత్మబలిదానాలు చేసుకున్నారు. వాళ్ళ కుటుంబాల్లో తీరని శోకం నింపారు. కుటుంబానికి ఆసరాగా నిలబడాల్సిన వారు ఇలా చేసుకోవడంతో ఆ కుటుంబాలు అన్ని రకాలుగా విధ్వంసమయ్యాయి. తెలంగాణ వచ్చిన తరువాత కూడా అమరవీరులకు, వాళ్ళ కుటుంబాలకు సరియైన రీతిలో న్యాయం జరగని సంగతి ఒక చేదు వాస్తవం. ఈ అనుభవాలు ఏ రకమైన ఉద్యమంలో ఉన్నవారికైనా పాఠాలు నేర్పిస్తాయి. యువత ఇవన్నీ గమనించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఉద్రేకానికిలోను కావటమన్నది ఉద్యమాలలో సహజమే. కానీ అది ప్రాణాలను తీసుకునే స్థాయిలో ఉండకూడదు. యువకులు బిసి ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి, బిసి రిజర్వేషన్లు సాధించిన తరువాత అధికారాన్ని సాధించుకొని తమ జాతికి న్యాయం చేయాలి. అలా జరగాలంటే బతికి సాధించాలి.
తోకల రాజేశం
9676761415