అమరావతి: మంచి ఆలోచన ఎవరు ఇచ్చినా స్వీకరిద్దామని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. మనం చేసే పనిలో బాధ్యత, జవాబుదారీతనం ఉండాలని అన్నారు. సచివాలయంలో సిఎం అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు నిర్వహించారు. జిఎస్ డిపి, కెపిఐ, పర్ సెప్షన్, ఈ-ఆఫీస్ అంశాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మెరుగైన ఫలితాలు వచ్చే వాటికి ప్రాధాన్యత ఇస్తున్నామని, నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా ఎలా పనిచేస్తున్నామని అనేది ముఖ్యమని తెలియజేశారు. మనం చేసే పని వల్ల ప్రజలు మనతో కలిసి వస్తున్నారా లేదా గమనించాలని, ఎన్ని ఫిర్యాదులు వచ్చినా.. కోర్టు కేసులను దాటుకొని కానిస్టేబుళ్ల ఉద్యోగాలిచ్చామని పేర్కొన్నారు. అంతకుముందు డిఎస్సి పెట్టామని.. దానికి కూడా ఇలాగే గందరగోళం సృష్టించారని విమర్శించారు. బాధ్యత కలిగిన ప్రభుత్వంమంటే.. అధికారులు దుర్వినియోగం కాదు..సద్వినియోగం కావాలని అన్నారు. అన్ని సేవలు ఆన్ లైన్ లోనే అందించే ప్రయత్నాలు చేస్తున్నామని, ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్ తీసుకొచ్చామని చెప్పారు. అన్ని సమస్యల వివరాలు ఉంటాయని, పరిష్కారం చేయాలని కలెక్టర్లకు సూచించారు. హార్డ్ వర్క్ కాదు.. స్మార్ట్ వర్క్ చేయాలని, కేంద్రప్రభుత్వ పథకాలు ఉపయోగించుకోవాలని అన్నారు.
సూపర్ సిక్స్ పథకాలతో ముందుకెళ్తున్నామని, పేదల సేవలో భాగంగా ఇంటింటికి వెళ్లి పింఛన్లు ఇస్తున్నామని అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉపయోగించుకోవాలని, ఎంతమంది పిల్లలున్నా తల్లికి వందనం అమలు చేస్తున్నామని తెలిపారు. అన్నదాత సుఖీభవ రెండో విడత కూడా ఇచ్చామని, దీపం, స్త్రీశక్తితో పాటు ఇతర కార్యక్రమాలు అందిస్తున్నామని చెప్పారు. మెగా డిఎస్సి, కానిస్టేబుళ్ల పోస్టులు భర్తీ చేశామని, అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని అన్నారు. పథకాల అమలులో కలెక్టర్లు కీలకంగా ఉంటారని, అప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్.. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్పారు. పెట్టుబడులకు ముందుకొస్తున్న వారికి ఎలాంటి జాప్యం లేకుండా అనుమతులివ్వాలని, ఏ రాష్ట్రానికి రాని పెట్టుబడులు వస్తున్నాయంటే మన విధానమే కారణమని ఆనందాన్ని వ్యక్తం చేశారు. పి-4ఒక వినూత్న కార్యక్రమని, పి-4 విధానంలో భాగస్వాములయ్యేలా చూడాలని, ఆర్థిక సంస్కరణలు వచ్చాక ఆలోచనల విధానం మారిందని అన్నారు. విలువలు వేరు.. సిద్దాంతాలు వేరు అని..ప్రతి ఒక్కరికీ మెరుగైన జీవన ప్రమాణాలు కావాలని కోరారు. మనం ఏ పని చేస్తున్నా వివరాలు సమగ్రంగా ఉండాలని, అనుకున్న సమయానికి లక్ష్యాలు నెరవేరేలా కృషి చేయాలని చంద్రబాబు స్పష్టం చేశారు.