దేశ అణురంగం ప్రైవేట్‌కు ద్వారాలు తెరిచింది.ఈ కీలక రంగం సంబంధిత అణు ఇంధన రంగంలో ప్రైవేటు భాగస్వామ్యం వీలు కల్పించే బిల్లుకు లోక్‌సభ బుధవారం ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ దీనిపై సభలో స్పందించారు. అణు ఇంధన రంగంలో స్వయంసమృద్థి దిశలో ఈ బిల్లు ఆమోదం కీలకం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2047 నాటికి భారతదేశం 100 జిడబ్లుల అణు ఇంధన ఉత్పత్తి సామర్థం సంతరించుకోవడానికి సముచిత రీతిలో ఈ ప్రైవేటు భాగస్వామ్యం పనికివస్తుందని తెలిపారు. అణు ఇంధన రంగంలో స్వయంసమృద్ధి లక్ష సాధనకు ఉద్ధేశించిన శాంతి బిల్లును ప్రతిపక్షాల వాకౌట్ల మధ్య సభలో మూజువాణి ఓటుతో ఆమోదించారు . ఇది మైలురాయి వంటి చట్టానికి దారితీస్తుందని మంత్రి తెలిపారు. దేశ ప్రగతి యాత్రకు బిల్లు దోహదం చేస్తుందని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా భౌగోళికరాజకీయాలలో దేశం కీలక పాత్ర వహిస్తోందిం.
ఈ దశలో మనం ప్రపంచ స్థాయి కొలమానాలను చేరుకోవల్సి ఉంటుంది. ప్రామాణికతలను సాధించాలి. ప్రపంచ స్థాయి వ్యూహాలలో ధీటుగా నిలిచిగెలిచి తీరాల్సి ఉంటుందని, ఉత్సాహవంతులైన ప్రైవేటు భాగస్వాముల ప్రవేశంతో అణు ఇంధన రంగం బలోపేతం అవుతుందని తెలిపారు. అయితే ఈ బిల్లుపై ప్రతిపక్షాలు తమ వ్యతిరేకత వ్యక్తం చేశాయి. కీలకమైన అణు ఇంధన రంగంలోకి ప్రైవేటు కంపెనీల ప్రవేశంతో విషమకర పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశాయి. అణు రంగం విషయంలో జవాబుదారి లేకుండా పరిస్థితులు ఏర్పడుతాయని పేర్కొన్నారు. ఇంతకు ముందు ఉన్న చట్టం ప్రకారం అణు దుర్ఘటనలు జరిగినప్పుడు సంబంధితులు బాధ్యత వహించాల్సి ఉండేది. జవాబుదారి కావల్సి ఉండేది. అయితే ఇప్పుడు ఈ నిబంధన లేకుండా చేశారని విమర్శించిన ప్రతిపక్షాలు బిల్లు ప్రవేశం దశలో సభ నుంచి వాకౌట్‌కు దిగాయి.