అమరావతి: ఐటీ కంపెనీలన్నీ విశాఖకే వస్తున్నాయని ఎపి మంత్రి లోకేష్ తెలిపారు. విమానయానం, ఏరోస్పేస్, రక్షణ రంగాలు వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని అన్నారు. జిఎంఆర్, మాన్యాస్ ఎడ్యు సిటీ ఏర్పాటు కార్యక్రమంలో లోకేష్ పాల్గొన్నారు. భోగాపురంలో ఎడ్యు సిటీ ప్రాజెక్టు, దేశంలోనే మొదటి ఏవియేషన్, ఏరోస్పేస్, డిఫెన్స్ ఎడ్యు సిటీ అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. జిఎంఆర్, మాన్సాస్ ఎడ్యు సిటీ ఏర్పాటు కార్యక్రమంలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జిఎంఆర్ ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డని, మధ్యతరగతి కుటుంబంలో జన్మించి.. అతిపెద్ద పారిశ్రామికవేత్తగా ఎదిగారని కొనియాడారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు ఎలా అభివృద్ధి చేశారో చూస్తున్నామని, ఆనాడు ఒక విజన్ తో ఎపి సిఎం చంద్రబాబు నాయుడు ముందుకెళ్లారని తెలియజేశారు.
కొంతమంది విజన్ లెస్ పీపుల్స్.. విజనరీలను ఎగతాళి చేస్తారని, ప్రపంచ సివిల్ ఏవియేషన్ వర్క్ ఫోర్స్ లో 25 శాతం తెలుగువాళ్లు ఉండాలనేది లక్ష్యం అని.. లోకేష్ పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి ఇన్ స్టిట్యూట్ ఏర్పాటు చేయాలని ఆలోచించారని, ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనేది తమ లక్ష్యం అని.. అన్నారు. 99 పైసలకు భూములిస్తామంటే చాలామంది ఎగతాళి చేశారని, భూములిస్తే సరిపోతుందా.. కంపెనీలు వస్తాయా అని హేళన చేశారని చెప్పారు. ఆ ఒక్క నిర్ణయంతో కాట్నిజెంట్, టిసిఎస్ వచ్చాయని, విశాఖకు వంద రోజుల్లో కనీసం మరో రెండు ఐటీ కంపెనీలు తీసుకొస్తామని సవాల్ విసిరారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ప్రథమ స్థానంలో ఉంచే బాధ్యత తమదని, మంచి మనసుతో చేస్తే ఏ పని అయినా సాధ్యమవుతుందని లోకేష్ స్పష్టం చేశారు.