యూట్యూబ్ స్టార్‌గా మంచి పేరు తెచ్చుకున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ అండ్ డాన్సర్ గౌరవేని శివాని సర్పంచ్ బరిలో విజయం సాధించి, సత్తా చాటింది. రాజన్న సిరిసిల్ల జిల్లా, ఇల్లంతకుంట మండలం, బోటిమీది పల్లె గ్రామ సర్పంచ్ బరిలో నిలిచి ప్రత్యర్థి పై విజయం సాధించింది. రెండో విడతలో జరిగిన సర్పంచ్ ఎన్నికల బరిలో బోటిమీద పల్లె సర్పంచ్‌గా గెలుపొందడం పట్ల పలువురు సామాజిక మాధ్యమాల నుండి, ప్రత్యక్షంగా శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. ఈ గ్రామంలో వ్యవసాయ కుటుంబానికి చెందిన గౌరవేణి సుమన్‌కు, నాగర్‌కర్నూల్ చెందిన శివానికి ఏడేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది.
సోషల్ మీడియా ద్వారా వీరిద్దరి పరిచయం ప్రేమగా మారి, ఇద్దరు ఒక్కటై వివాహం చేసుకున్నారు. అప్పటి నుండి సుమన్ శివాని ఇద్దరై పలు పాటలకు కొరియోగ్రఫీతో పాటుగా డ్యాన్సులు చేస్తూ యూట్యూబ్‌లలో ప్రాచుర్యం పొందారు. సుమారుగా శివాని 300కు పైగా పాటల్లో నృత్యాలు చేసి ఆమె ఫేమస్ అయ్యింది. ముఖ్యంగా నాగులమ్మో నాగులమ్మో నల్లనాగులమ్మ… చిన్న దొర బంగుల మీద… లాగలున్న దొడ్లేకు పెండ తీయపోమ్మటే ల్యాగలాట ఆడుతాడు సుడువదినే .. ఇలా 300కు పైగా పాటలకు సోలో పర్ఫార్మ్ చేస్తూ 50 మిలియన్ వ్యూస్‌తో యూట్యూబ్ స్టార్ట్‌గా నిలిచింది.
నన్ను గెలిపించిన ప్రజలకు అభివృద్ధి చేసి చూపిస్తా: శివాని
‘నాపై నమ్మకంతో నన్ను ఎంతో హత్తుకొని గెలిపించిన ప్రజలందరికీ అభివృద్ధి చేసి చూపిస్తానని బోటుమీదపల్లె సర్పంచ్ గౌరవేని శివాని సుమన్ అన్నారు. యూట్యూబ్ ద్వారా నాకు ఎంతగానో పేరు వచ్చిందని, కానీ ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచిన తృప్తి ఎంతో గొప్పదది. గ్రామాన్ని సుందరంగా అభివృద్ధి చేస్తాను’ అని అన్నారు.