న్యూఢిల్లీ: గ్రామీణుల కోసం దేశవ్యాప్తంగా అమలులో ఉన్న మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం(ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ) పేరు మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ప్రతిపక్షనేత, కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీ.. కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేశారు. గాంధీజీ ఆదర్శాలను మోడీ ప్రభుత్వం అవమానిస్తోందని మండిపడ్డారు. ప్రధాని మోడీకి రెండు అంశాలు అసలు గిట్టవన్నారు. ఒకటి, గాంధీ ఆలోచనలు.. రెండు, పేదల హక్కులు మోడీకి నచ్చవని ఫైరయ్యారు. గాంధీజీ గ్రామ స్వరాజ్యం ఆలోచనల ప్రతిరూపమే ఉపాధి హామీ పథకమని.. ఈ పథకం గ్రామీణులకు జీవనరేఖ లాంటిది ఆయన పేర్కొన్నారు. ఈ పథకం పేదలకు ఆర్థిక భద్రత కల్పిస్తుందని రాహుల్ గాంధీ అన్నారు.
కాగా, ఉపాధి హామీ పథకం స్థానంలో కొత్త చట్టం తీసుకువచ్చే దిశగా కేంద్రం చర్యలు ముమ్మరం చేసింది. సోమవారం లోక్‌సభలో మూడు కీలక బిల్లులతో పాటు ఉపాధి హామీ స్థానంలో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవక్ మిషన్(గ్రామీణ్)(విబిజి ఆర్‌ఎఎం జి)2025 పేరిట కొత్త బిల్లును ప్రవేశపెట్టేందుకు సిద్ధమైనప్పటికీ విపక్షాల తీవ్ర వ్యతిరేకత నడుమ వెనక్కి తగ్గింది. అయితే లోక్‌సభ సభ్యులకు నూతన బిల్లు ప్రతులను అందజేసినట్లు సమాచారం.