కేరళలో స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు పాలకవర్గం సిపిఎం నేతృత్వం లోని ఎల్‌డిఎఫ్‌కు, విపక్ష కాంగ్రెస్ సారథ్యంలోని యుడిఎఫ్‌కు గట్టి షాక్ ఇచ్చాయి. చివరకు కేరళ రాజకీయ తెరపై ‘కమలం’ విరిసింది. రానున్న ఏప్రిల్ మే నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మూడోసారి కూడా అధికారం చేపట్టేలా ఈ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు ప్రేరణ కలిగిస్తాయని ఎంతో కలలుగన్న ఎల్‌డిఎఫ్‌కు తీవ్ర ఆశాభంగం తప్పలేదు. గ్రామ పంచాయతీలు, బ్లాక్ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ నేతృత్వం లోని విపక్షానికే చోటు లభించడం అనూహ్య పరిణామం. 14 జిల్లా పంచాయతీల్లో ఒక్కో ఫ్రంట్ చెరి సమాన సంఖ్యలో సీట్లు దక్కించుకున్నాయి. గత రెండు దశాబ్దాలుగా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుతో ప్రజలను ప్రభావితం చేయడంలో పాలకవర్గం ఎల్‌డిఎఫ్ రికార్డు నెలకొల్పినప్పటికీ, ఈసారి దశాబ్ద కాలంగా అధికారంలో లేని యుడిఎఫ్ పైనే ఓటర్లు సానుభూతి చూపించడం ప్రత్యేకంగా గమనించవలసి ఉంది. ప్రతి ఐదేళ్లకు ప్రభుత్వం మారే 50 ఏళ్ల సంప్రదాయాన్ని 2021 లో ఎల్‌డిఎఫ్ ఛేదించినా, ఈసారి ప్రభుత్వంపై వ్యతిరేకత ఎక్కువగానే కనిపించింది.
శబరిమల అయ్యప్ప క్షేత్రంలోని బంగారు ఆభరణాల చోరీ, ఆలయ యాజమాన్య బోర్డు ప్రెసిడెంట్ అయిన సిపిఎం నాయకుని అరెస్టు, ఆయనపై తదుపరి చర్య తీసుకోవడానికి అధికార పార్టీ సిపిఎం అంగీకరించకపోవడం ఇవన్నీ అయ్యప్ప భక్తులకే కాదు, ప్రజలకు కూడా తీవ్ర ఆగ్రహాన్ని కలిగించాయి. ఈ విషయం లో అలసత్వం చూపిస్తే తీవ్ర పరిణామాలుంటాయని యుడిఎఫ్ హెచ్చరించింది కూడా. ఇక కాంగ్రెస్ నేతృత్వం లోని యుడిఫ్ విషయానికి వస్తే యువజన కాంగ్రెస్ శాసనసభ్యునిపై అత్యాచార కేసులు ఉన్నప్పటికీ, స్థానిక విజయం అసెంబ్లీ ఎన్నికల ముందు యుడిఎఫ్‌ను మరింత బలోపేతం చేసిందని చెప్పవచ్చు. కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలున్నాయి. కానీ వాటి గురించి ప్రజలు పట్టించుకోలేదు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వమే ఆ సమస్యను పరిష్కరించుకుంటుందని విడిచిపెట్టి యుడిఎఫ్‌కే పట్టం కట్టారు. దీన్ని గమనించి పార్టీలోని అంతర్గత కుమ్ములాటల చిక్కుముడులను అధిష్ఠాన వర్గం ముందు పరిష్కరించక తప్పదు. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారో ఎప్పటికప్పుడు పరిశీలించి, ఆమేరకు స్థానిక నాయకత్వాన్ని పటిష్టపర్చాలి. ప్రజల్లో పార్టీపై నమ్మకం పెంచాలి. ఈ విజయావకాశాన్ని రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమకు తిరిగి ప్రజలు పట్టం కట్టేలా కాంగ్రెస్ నేతృత్వం లోని యుడిఎఫ్ గట్టిగా నిర్మాణాత్మక కృషి సాగిస్తేనే కొంతవరకు నెగ్గుకు రాగలుగుతుంది. తిరువనంతపురం కార్పొరేషన్‌లో ఘన విజయం సాధించిన ఎన్‌డిఎ కూటమి కార్పొరేషన్ పాలనా పగ్గాలు చేపట్టడానికి రంగం సిద్ధం చేసుకుంటోంది.
ఇతర ప్రాంతాల్లో సుస్థిరత సాధించలేకపోయినప్పటికీ, రాష్ట్ర రాజధానిగా గుండెకాయ వంటి తిరువనంతపురం కార్పొరేషన్ నుంచి చక్కని పాలన అందించి రాష్ట్రానికి ఆదర్శం అవుతామని బిజెపి ధీమాగా చెబుతోంది. తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్‌లో 45 ఏళ్లుగా ఎల్‌డిఎఫ్ పాలనే కొనసాగుతోంది. ఈసారి మొత్తం 101 వార్డుల్లో 50 వార్డులను బిజెపి (ఎన్‌డిఎ) గెల్చుకుంది. ఎల్‌డిఎఫ్‌కు 29 వార్డులు, యుడిఎఫ్‌కు 19 వార్డులు మాత్రమే దక్కాయి. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ఇంకా చాలా కాలం ఉన్నప్పటికీ తిరువనంతపురం లోక్‌సభ నియోజకవర్గం లోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఈసారి గెలుపొందడానికి బిజెపి వ్యూహాలు రూపొందిస్తోంది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ ఎల్‌డిఎఫ్ 99, విపక్షం యుడిఎఫ్ 41 స్థానాలు గెల్చుకోగా, త్రిస్సూర్ స్థానాన్ని ఎన్‌డిఎ దక్కించుకుంది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్‌డిఎ థర్డ్ ఫ్రంట్‌గా అవతరించకుండా ఉంటే స్థానిక సంస్థల విజయాలపై యుడిఎఫ్ మరింత ఉత్సాహంగా ఉండేది. రాష్ట్రంలో ఎక్కువగా ద్విపార్శ సంకీర్ణ పోటీలు జరుగుతున్నాయి. ఈ పార్టీలు ఏ సమయంలో ఎటువైపు మొగ్గు చూపుతాయో చెప్పడం కష్టం. ఈ నేపథ్యంలో మూడవ ఫ్రంట్‌గా ఎన్‌డిఎ కూటమి అవతరించడం మిగతా పార్టీలన్నిటికీ గందరగోళంగా మారే పరిస్థితి ఏర్పడుతుంది.
దేశంలోనే ఏకైక వామపక్ష పాలక రాష్ట్రంగా కేవలం తన వ్యక్తిత్వంతో ఆదర్శాన్ని పినరయి విజయన్ ప్రదర్శించారు. ఇప్పుడు ఓటు వాటాల పరంగా వారి ఉనికితో సంబంధం లేకుండా ఎల్‌డిఎఫ్ ఓడిపోవడం వామపక్ష పార్టీలను ఓ మూలకు నెట్టేసినట్టే అవుతోంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి సురేష్ గోపీ త్రిస్సూర్ లోక్‌సభ స్థానం నుంచి 74,686 ఓట్ల మెజార్టీతో చారిత్రాత్మక విజయం సాధించారు. బిజెపి ఏకైక ఎంపీగా నిలిచారు. ఈ విజయం కేరళ రాజకీయాల్లో త్రిముఖ పోటీకి నాంది పలికిందని, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి విజయావకాశాలు మెండుగా ఉంటాయని కాషాయ నాథులు అంచనా వేశారు. కానీ లోక్‌సభ ఎన్నికల ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికలపై ఏమాత్రం పడలేదు. కమలనాథుల అంచనాలన్నీ తలకిందులయ్యాయి. 2020 నుంచి త్రిస్సూర్ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు బిజెపికి తప్పుడు సంకేతాలనే అందిస్తున్నాయి. ఆనాడు త్రిస్సూర్ అసెంబ్లీలో బిజెపి 6, ఎల్‌డిఎఫ్, యుడిఎఫ్ చెరో 24 స్థానాలను సాధించుకున్నాయి. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో త్రిస్సూర్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఇలాంటి ఫలితాలు రాకూడదని పార్టీలు అనుకుంటున్నాయి. ఏదేమైనా సిపిఎం పట్టు సడలి అరుణ కిరణాలు మసకబారుతున్నాయా? అన్నప్రశ్న ఎదురవుతోంది.