=యుఎఇ వేదికగా జరుగుతున్న అండర్19 ఆసియా కప్‌లో భారత యువ జట్టు రికార్డు విజయం సాధించింది. మంగళవారం మలేసియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 315 పరుగుల తేడాతో జయకేతనం ఎగుర వేసింది. యువ సంచలనం అభిజ్ఞాన్ కుందు అజేయ డబుల్ సెంచరీతో కదం తొక్కడంతో తొలుత బ్యాటింగ్ చేసిన యూత్ టీమ్ 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 408 పరుగుల భారీ స్కోరును సాధించింది. తర్వాత లక్షఛేదనకు దిగిన మలేసియాను భారత బౌలర్లు 93 పరుగులకే పరిమితం చేశారు. మలేసియా టీమ్‌లో హంజా (35), డియాజ్ పాత్రో (13), ముహద్ అఫినిద్ (12) మాత్రమే రెండంకెల స్కోరును అందుకున్నారు. భారత బౌలర్లలో దీపేశ్ దేవేంద్రన్ మరోసారి అద్భుత బౌలింగ్‌ను కనబరిచాడు. అసాధారణ బౌలింగ్‌తో ఆకట్టుకున్న దీపేశ్ 22 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లను పడగొట్టాడు. మోహన్‌కు రెండు వికెట్లు దక్కాయి.
వైభవ్ దూకుడు..
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ప్రత్యర్థి టీమ్ ముందు 409 పరుగుల క్లిష్టమైన లక్ష్యాన్ని ఉంచింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన భారత్‌కు ఆశించిన స్థాయిలో శుభారంభం దక్కలేదు. కెప్టెన్ అయుష్ మాత్రే (14) పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చిన విహాన్ మల్హోత్ర (7) కూడా విఫలమయ్యాడు. అయితే ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసక ఇన్నింగ్స్‌తో స్కోరును పరిగెత్తించాడు. చెలరేగి ఆడిన వైభవ్ 26 బంతుల్లోనే 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 50 పరుగులు చేశాడు.
కుందు వీరవిహారం..
ఆ తర్వాత ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతలు వేదాంత్ త్రివేది, అభిజ్ఞాన్ కుందు తమపై వేసుకున్నారు. ఇద్దరు ప్రత్యర్థి టీమ్ బౌలర్లపైఎదురు దాడికి దిగి స్కోరును పరిగెత్తించాడు.కుందు ఆకాశమే హద్దుగా చెలరేగి పోయాడు. వరుస ఫోర్లు, సిక్సర్లతో మలేసియా బౌలర్లను హడలెత్తించాడు. అతనికి వేదాంత్ పూర్తి సహకారం అందించాడు. సమన్వయంతో బ్యాటింగ్ చేసిన వేదాంత్ 7 ఫోర్లతో 90 పరుగులు చేసి తృటిలో సెంచరీ చేస్ అవకాశాన్ని చేజార్చుకున్నాడు. మరోవైపు చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో అలరించిన అభిజ్ఞాన్ కుందు 125 బంతుల్లోనే 17 ఫోర్లు, 9 భారీ సిక్సర్లతో 209 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో భారత్ ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది.