న్యూఢిల్లీ: బీమా రంగంలోకి 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డిఐ) తీసుకు వచ్చేందుకు రూపొందించిన బిల్లును లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం మంగళవారం విపక్షాల తీవ్ర నిరసనల మధ్య ప్రవేశ పెట్టింది. సబ్‌కా బీమా సబ్‌కీ రక్షా (బీమా చట్టాల సవరణ)చట్టం , 2025 పేరుతో ఈ బిల్లును ప్రవేశ పెట్టింది. దీనికింద ఇన్సూరెన్స్ యాక్ట్ (1938),ఇన్సూరెన్స్ కార్పొరేషన్ యాక్ట్ (1956). ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ యాక్ట్ (1999)ను సవరించడమైంది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ దీనిపై మాట్లాడుతూ.. సామాన్య ప్రజలకు బీమా సౌకర్యం విస్తరింప చేయడమే మోడీ ప్రభుత్వ లక్షమని ఆమె పేర్కొన్నారు. కొవిడ్ మహమ్మారి సమయంలో కూడా బలహీనవర్గాలకు బీమా కల్పించినట్టు ఉదహరించారు. విపక్ష సభ్యులు కొంతమంది అభ్యంతరాలు తెలియజేయడం చర్చల్లో భాగమని, ఈ సందర్భంగా వచ్చిన ప్రశ్నలకు తాను సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఆర్‌ఎస్‌పి సభ్యుడు ఎన్‌కె ప్రేమచంద్రన్, డిఎంకె సభ్యులు టి. సుమతి, టిఎంసి సభ్యులు సౌగతా రాయ్, ఈ బిల్లు వల్ల ప్రజలకు ఒరిగేదేమీ లేదని విమర్శించారు. ఈ బిల్లు ప్రకారం ఎఫ్‌డిఐ పరిధి 74 శాతం నుంచి 100 శాతం వరకు పెరుగుతుంది.
71 కాలం చెల్లిన చట్టాల రద్దుకు బిల్లు
కేంద్ర ప్రభుత్వం 71 కాలం చెల్లిన చట్టాలను రద్దు చేయడానికి లోక్‌సభలో మంగళవారం ‘ విలీనం మరియు సవరణ బిల్లు 2025ను ప్రవేశ పెట్టింది. ఇందులో చాలావరకు సవరణ చట్టాలే (65) , మరికొన్ని ప్రధాన చట్టాలు (6) ఉన్నాయి. ప్రభుత్వ పనితీరును మెరుగుపర్చడానికి, చట్టపరమైన వ్యవస్థను సరళీకృతం చేయడానికి ఈ బిల్లు ఉద్దేశించబడింది. మూజువాణి ఓటుతో ఈ బిల్లును ఆమోదించారు. కేంద్ర న్యాయమంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ బిల్లు వల్ల పౌరుల జీవన పరిస్థితులు సరళమవుతాయని చెప్పారు.