వాషింగ్టన్: బీబీసీపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పరువు నష్టం దావా వేశారు. 10 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.90 వేల కోట్లు) నష్టపరిహారం డిమాండ్ చేశారు. అమెరికా లోని క్యాపిటల్ హిల్‌పై దాడి సందర్భంగా 2021లో ట్రంప్ చేసిన ప్రసంగాన్ని తప్పుడు అర్థం వచ్చేలా మార్చేసిందని బీబీసిపై ఆయన ఆరోపించారు. 33 పేజీల ఈ దావా సోమవారం నాడు దాఖలు చేశారు. శాంతియుత నిరసనలకు పిలుపునిచ్చిన తన ప్రసంగాన్ని రెండు చోట్ల సవరించి ఉద్వేగభరితంగా మార్చారని ట్రంప్ ఆరోపించారు.
అంతేకాదు ఫ్లోరిడా చట్టాలను ఉల్లంఘించి అన్యాయమైన వ్యాపార విధానాలు పాటిస్తోందని వాదించారు. ఈ రెండు ఆరోపణలపై ఒక్కొక్కదానికి 5 బిలియన్ డాలర్ల చొప్పున నష్టపరిహారం డిమాండ్ చేశారు. 2021 జనవరి 6 న వాషింగ్టన్ లోని క్యాపిటల్ హిల్‌పై తన మద్దతుదారులు దాడులు చేసిన సందర్భంగా ట్రంప్ సుమారు గంటపాటు ప్రసంగించారు. దీనిని తన మనోరమ డాక్యుమెంటరీలో బీబీసీ తప్పుగా మార్చి ప్రసారం చేసింది. అందులో “క్యాపిటల్ హిల్‌కు వెళ్తున్నాం. మీతోపాటు నేనూ అక్కడికి వస్తున్నా. మనం పోరాడదా. ఘోరంగా పోరాడదాం” అన్నట్టుగా ఉంది. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ట్రంప్ రాజకీయ ఒత్తిడి నేపథ్యంలో బీబీసీకి ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ టిమ్ డేవీ, న్యూస్ చీఫ్ టర్నెస్ డెబోరా రాజీనామా చేయాల్సి వచ్చింది.