నాగారం భూముల వివాదానికి సంబంధించి బిర్ల మల్లేష్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ప్రాథమిక దశలోనే కొట్టివేసింది. ఈ కేసులో ఇప్పటికే హైకోర్టు ఇచ్చిన తీర్పునే సుప్రీంకోర్టు సమర్థించింది. నాగారం ప్రాంతంలోని భూములను భూధాన్ ల్యాండ్స్‌గా పేర్కొంటూ ఐఎఎస్, ఐపిఎస్ అధికారులు కొనుగోలు చేసిన భూములపై బిర్ల మల్లేష్ వివాదం సృష్టించారు. ఈ నేపథ్యంలో మల్లేష్ ముందుగా హైకోర్టును ఆశ్రయించగా ఐఎఎస్, ఐపిఎస్ అధికారులకు అనుకూలంగా హైకోర్టు తీర్పు వెలువరించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ మల్లేష్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్‌లో తగిన ఆధారాలు లేవని భావించిన సుప్రీంకోర్టు విచారణకు కూడా అర్హత లేదని పేర్కొంటూ పిటిషన్‌ను పిటిషన్ స్థాయిలోనే కొట్టివేసింది. దీంతో నాగారం భూముల వివాదంలో హైకోర్టు తీర్పే తుది నిర్ణయంగా నిలిచినట్లైంది.
సుప్రీంకోర్టు కూడా అదే తీర్పును సమర్థించడంతో బిర్ల మల్లేష్‌కు ఈ కేసులో ఎదురుదెబ్బ తగిలినట్లైంది. అంతకుముందు నాగారం భూముల వివాదానికి సంబంధించి బిర్ల మల్లేష్ తెలంగాణ హైకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని నాగారం గ్రామంలోని సర్వే నెంబర్ 181, 182, 194, 195 లలో ఉన్న భూములకు సంబంధించింది. వీటిలో ముఖ్యంగా భూదాన్ భూముల అన్యాక్రాంతం జరిగిందని బిర్ల మల్లేష్ ఆరోపించారు. వందల కోట్ల విలువైన ఈ భూదాన్ భూములను కొంతమంది ఐఎఎస్, ఐపిఎస్ అధికారులు, ఇతర ఉన్నతాధికారులు స్థానిక రెవెన్యూ అధికారుల సహకారంతో అక్రమంగా తమ పేర్ల మీదకు బదిలీ చేసుకున్నారని, రికార్డులు తారుమారు చేశారని ఆయన ఆరోపించారు.