బెంగళూరు: డిజిటల్ అరెస్టు భయంతో 2 ప్లాట్లు, ఓ ఫ్లాట్ అమ్మి సైబర్ నేరస్థులకు రూ.2 కోట్లు చెల్లించిన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరులోని ఓ సాఫ్ట్‌వేర్ సంస్థలో పనిచేస్తున్న బబితా దాస్ తన పదేళ్ల కుమారుడితో కలిసి నివసిస్తోంది. జూన్‌లో ఓ వ్యక్తి కొరియర్ అధికారిగా నటిస్తూ, ఆమెకు కాల్ చేశాడు. తన ఫోన్ నెంబర్, ఆధార్ కార్డు వివరాలతో అనుసంధానమై ఉన్న పార్శిల్‌లో అనుమానాస్పద వస్తువులు వచ్చినట్టు తెలిపాడు. ఆ తరువాత మరికొందరు వ్యక్తులు తాము ముంబయికి చెందిన పోలీసులమంటూ బబితా దాస్‌కు ఫోన్ చేశారు. తనకు వచ్చిన పార్శిల్‌లో అనుమానాస్పద వస్తువులు ఉండడంతో డిజిటల్ అరెస్టు చేసినట్టు తెలిపారు.
ఈ విషయంలో దర్యాప్తు పూర్తయ్యేవరకు బయటకు వెళ్లొద్దని హెచ్చరించారు. వారు చెప్పిన ఓ మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయాలని, లేదంటే ఆమె కుమారుడు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని బెదిరించారు. పరిశీలన కోసం ఖాతాల్లో ఉన్నడబ్బు, ఆస్తుల వివరాలు తెలపాలని డిమాండ్ చేశారు. తన కుమారుడి భవిష్యత్తు గురించి భయపడిన టెకీ తన ఆస్తుల వివరాలన్నీ వారికి తెలియజేసింది. అనంతరం వారు సూచించిన విధంగా విజ్ఞాన్ నగర్ లోని ఫ్లాట్‌ను, మలూర్ లో తనకున్న రెండు ప్లాట్‌లను అమ్మి మొత్తం డబ్బులను సైబర్ నేరగాళ్లు పంపిన బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసింది. ఇంకా డబ్బులు పంపాలని వారు బెదిరించడంతో బ్యాంకు నుంచి లోన్ తీసుకుని మరీ చెల్లించింది.
తాజాగా ఆమెకు కాల్ చేసిన సైబర్ నేరగాళ్లు చెల్లించిన మొత్తం డబ్బును తిరిగి పొందడానికి దగ్గరలోని పోలీస్ స్టేషన్‌ను సంప్రదించమని చెప్పి కాల్ కట్ చేశారు. తర్వాత వారిని సంప్రదించడానికి ప్రయత్నించగా, ఫోన్‌లు స్విచ్‌ఆఫ్ రావడంతో మోసపోయానని గ్రహించి టెకీ వైట్‌ఫీల్డ్ సైబర్‌క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగు లోకి వచ్చింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. డబ్బు బదిలీ చేసిన బ్యాంకు ఖాతాలను గుర్తించామని, వాటిని బ్లాక్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు.