కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయానికి అటవీ శాఖ షోకాజ్ నోటీసు జారీ చేయడం పట్ల బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన, సనాతన ధర్నాకి ప్రతీక అయిన కొండగట్టు అంజన్న ఆలయంపై ఈ తరహా చర్యలు హందూ భక్తుల విశ్వాసాలపై దాడిగా భావిస్తున్నామని ఆయన మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆలయానికి, ఆలయ ఆవరణలో ఆరు ఎకరాల భూమి పరిమితి అంటూ కొత్త వాదనను తీసుకుని రావడం భక్తులకు బాధను కలిగిస్తున్నదని ఆయన తెలిపారు. అటవీ శాఖ చెబుతున్న ఆరు ఎకరాల భూమిలోనే భక్తులకు అత్యంత అవసరమైన అన్నదాన సత్రం, పబ్లిక్ టాయిలెట్స్, వాటర్ ప్లాంట్, ఆగమ పాఠశాల, వేద విద్యార్థుల వసతి గృహం, భోజన శాల వంటి కీలక మౌలిక సదుపాయాలు ఉన్నాయని ఆయన తెలిపారు.మరోవైపు దేవాదాయ శాఖ కూడా అటవీ శాఖకు నోటీసు ఇచ్చిందని ఆయన తెలిపారు. కొండగట్టు శ్రీ ఆంజనేత స్వామి భూముల విషయంలో ఆలయానికి, అటవీ శాఖ మధ్య వివాదం ఆందోళన కలిగిస్తున్నదని ఆయన పేర్కొన్నారు.
అయినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని భక్తుల విశ్వాసాలు, థార్మిక సంప్రదాయాలు, పేద భక్తుల ఇబ్బందులు, ప్రజల సౌకర్యాలకు ప్రథమ ప్రాధాన్యతనిచ్చి ఈ వివాదానికి వెంటనే శాశ్వత పరిష్కారం చూపించాలని రాంచందర్ రావు డిమాండ్ చేశారు. గిరి ప్రదక్షిణ, వాహన పూజలు, పార్కింగ్ వంటి అంశాల వల్ల భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో దేవాదాయ శాఖ అభ్యంతరం తెలుపుతున్నప్పటికీ అటవీ శాఖ నోటీసు జారీ చేయడం అనవసర ఉద్రిక్తతలకు దారి తీస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.కొండగట్టు వద్ద ఆరు ఎకరాల స్థలానికి ప్రత్యామ్నాయంగా రాంసాగర్ గ్రామంలో ఉన్న దేవాదాయ శాఖ భూముల నుంచి ఎనిమిది ఎకరాలు ఇవ్వడానికి దేవాదాయ శాఖ ముందుకు వచ్చినా అటవీ శాఖ కొండగట్టు ఆలయం పరిథిలోనే వివాదాన్ని కొనసాగించడం వెనుక ఉన్న ఉద్దేశాలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని రాంచందర్ రావు తెలిపారు. ఇదిలాఉండగా కొండగట్టు అంజన్న ఆలయానికి ఉన్న భూములపై గతంలో సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన సీనియర్ సర్వేయర్ లక్ష్మణ్ రావు సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక అందించారని స్థానికులు చెబుతున్నారు.