గ్రామ పంచాయతీ ఎన్నికలతో తమ పార్టీలో జోష్ మరింత పెరిగిందని, బిఆర్‌ఎస్ (కారు)లో కంగారు మొదలైందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. గ్రామ పంచాయతీకి జరిగిన రెండు విడతల ఎన్నికల్లోనూ ప్రజలు కాంగ్రెస్‌ను ఆదరించారని ఆయన మంగళవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. ఇరవై ఏళ్ళ రాజకీయ జీవితంలో ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన కెటిఆర్ నాలుగు సర్పంచులను గెలిపించుకుని హడావుడి చేస్తున్నారని ఆయన విమర్శించారు. పదేళ్ళు అధికారంలో ఉన్న బిఆర్‌ఎస్‌కు ముప్పై శాతం సర్పంచ్ స్థానాల్లోనైనా విజయం సాధించలేకపోయిందని అన్నారు. అరవై శాతానికి పైగా స్థానాల్లో విజయం సాధించిన తాము ఏమనాలని ఆయన ప్రశ్నించారు. తమ పార్టీలో సర్పంచ్ స్థానాలకు ఏర్పడిన తీవ్ర పోటీ కారణంగానే బిఆర్‌ఎస్‌కు ఆ మాత్రం స్థానాలైనా దక్కాయని ఆయన తెలిపారు. బిఆర్‌ఎస్‌కు అనేక చోట్ల అభ్యర్థులే లేరని అన్నారు. మీ చెల్లి కవిత చేసిన అవినీతి, కుంభకోణాలకు ముందుగా కెటిఆర్ సమాధానం చెప్పాలని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ డిమాండ్ చేశారు.