సినిమాల పైరసీ కేసులో అరెస్టు అయిన ఐ బొమ్మ వెబ్‌సైట్, బప్పం టివి నిర్వాహకుడు ఇమంది రవిని పోలీస్ కస్టడీకి మరోసారి నాంపల్లి కోర్టు అనుమతించింది. సినిమాలను పైరసీ చేసి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన కేసులో హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. రవిపై హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు నాలుగు కేసులు నమోదు చేశారు. దీంతో గతంలో నాంపల్లి కోర్టును హైదరాబాద్ పోలీసులు కస్టడీకి కోరగా రెండు సార్లు అనుమతి ఇచ్చింది. పోలీసులు రవిని చంచల్‌గూడ జైలు నుంచి అదుపులోకి తీసుకుని రెండు సార్లు విచారణ చేసి పలు విషయాలు రాబట్టింది. అయితే కస్టడీలో రవి పూర్తిగా సహకరించకుండా అడిగన వాటికి సమాధానాలు దాటవేయడంతో విచారణలో కీలక విషయాలు రాబట్టలేదని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు మరోసారి కస్టడీకి ఇవ్వాలని నాంపల్లి కోర్టులో పిటిషనల్ దాఖలు చేశారు. దీనిపై రవి తరఫు న్యాయవాదులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మధ్య వాదనలు విన్న కోర్టు 12 రోజులు పోలీసుల కస్టడీకి అనుమతి ఇస్తూ మంగళవారం అనుమతి ఇచ్చింది. మూడు కేసుల్లో ఒక కేసుకు మూడు రోజుల చొప్పున 12 రోజులు విచారించేందుకు కోర్టు పోలీసులకు అనుమతి ఇచ్చింది. దీంతో పోలీసులు రవిని చంచల్‌గూడ జైలు నుంచి బుధవారం కస్టడీలోకి తీసుకుని మూడు కేసుల్లో విచారణ చేయనున్నట్లు తెలిసింది. మరో వైపు ఇప్పటికే రెండు సార్లు కస్టడీలోకి తీసుకుని విచారించారని, మరోసారి రవిని కస్టడీకి ఇవ్వకుండా బెయిల్ ఇవ్వాలని ఆయన తరఫున వాదిస్తున్న న్యాయవాది కోర్టును కోరారు.