2029లో జరిగే ఎన్నికల్లో తాను కచ్చితంగా పోటీ చేయనున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఎక్స్ వేదికగా ‘ఆస్క్ కవిత’ పేరుతో సోమవారం ఆమె నెటిజన్లతో ఇంటరాక్షన్ అయ్యారు. ఈ కార్యక్రమంలో నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు ఓపికగా సమాధానాలిచ్చారు. ఈ సందర్భంగా ఓ నెటిజన్.. ‘మీ కొత్త పార్టీ పేరు ఏంటి..?’ అని ప్రశ్నించగా..‘ఎలా ఉండాలో మీరే చెప్పండి’(వాట్ షుడ్ ఇట్ బి) అంటూ కవిత ఆసక్తికర సమాధానమిచ్చారు. ప్రజలు సూచించిన పేరునే పార్టీకి పెడుతామని అన్నారు. తెలంగాణ సాధికారిత సాధించాలంటే మెరుగైన, నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం ప్రజలకు అందాలని పేర్కొన్నారు. తెలంగాణలో తల్లితండ్రులు పిల్లల చదువుకోసం ఒక్క రూపాయి కూడా ఖర్చుపెట్టకుండా ఉండే పరిస్థితి రావాలని తెలిపారు.
ఉద్యోగాలు, స్కిల్, భద్రత మూడింటిలో దేనికి ప్రాధాన్యం ఇస్తారని ప్రశ్నించగా… యువతకు ఉద్యోగాలు కల్పించటమే తన ప్రథమ ప్రాధాన్యమని చెప్పారు. సామాజిక న్యాయం కోసం జాగృతి పోరాటం కొనసాగుతుందని అన్నారు. క్రమంగా జాగృతిని చాలా బలంగా తయారు చేస్తామని, త్వరలోనే జాగృతి మెంబర్ షిప్ డ్రైవ్ కూడా ప్రారంభిస్తామని వెల్లడించారు. సామాజిక తెలంగాణయే తన లక్ష్యమని కవిత మరోసారి స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉందన్న ప్రశ్నకు కవిత సమాధానమిస్తూ ఇచ్చిన హామీలను నెరవేర్చటంలో కాంగ్రెస్ అట్టర్ ప్లాప్ అయ్యిందని విమర్శించారు. తెలంగాణ విషయంలో తన విజన్, జాగృతి భవిష్యత్ కార్యాచరణ, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు సహా పలు ప్రశ్నలను నెటిజన్లు సంధించగా, వాటికి కవిత ఓపికగా సమాధానం ఇచ్చారు.