పుస్తకాలకు పెరుగుతున్న ఆదరణ: 38వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ 2025 డిసెంబర్ 19 నుండి మొదలై 29 వరకు తెలంగాణ కళాభారతి (ఎన్.టి.ఆర్. స్టేడియం) లో జరుగబోతోంది. ఈ మొత్తం రోజుల్లో పన్నెం డు నుండి పదిహేను లక్షలమంది పుస్తకాభిమానులు పాల్గొనే అవకాశం ఉంది. ఈ సందర్భం గా పుస్తకాల స్టాల్స్‌లో వందల, వేల పుస్తకాలు కొలువుదీరనున్నాయి. ఆ పదిరోజులు పుస్తకాల పండుగే. ప్రతిరోజూ ఒంటి గంటకు ప్రారంభమయ్యే బుక్ ఫెయిర్‌లో 2 గంటల నుండి 5 గం టల వరకు తెలంగాణ బాలోత్సవం నిర్వహణ లో పిల్లల కార్యక్రమాలు, ఐదింటి నుండి ఆరిం టి వరకు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సాంస్కృతిక కార్యక్రమాలు, ఆ తరవాత ‘పుస్తక స్ఫూర్తి’ కార్యక్రమం మూడు సెషన్లుగా సాగుతాయి. ఇందులో నచ్చిన పుస్తకం, ప్రభావితం చేసిన పుస్తకంపై చర్చలు, ప్రసంగాలు, కవి సమ్మేళనాలు ఉంటాయి. ఈ మూడు సెషన్లలో రెండు వందల వరకు సాహిత్యకారులు పాల్గొనే అవకాశం ఉంది. ఈ సంవత్సరం కూడా పుస్తక ప్రాధాన్యతను తెలుపుతూ ‘బుక్‌వాక్’ ఒకరోజు పుస్తక ప్రేమికులతో కలిపి జరుగుతుంది. ఇంకోవైపు రెండవ వేదికపై కొత్త పుస్తకాలు, వాటి ఆవిష్కరణలు.. అదొక సందడి. 1985లో 38సంవత్సరాల క్రితం ప్రారంభమైన హైదరాబాద్ బుక్ ఫెయిర్ ప్రతి ఏటా బుక్ ఫెయిర్‌లు నిర్వహిస్తోంది. గత సంవత్సరంలో లాగే 350 స్టాల్స్‌కు పైగా ఈ బుక్ ఫెయిర్‌లో ఉంటాయి. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై వంటి ప్రాంతాలనుంచి కూడా పబ్లిషర్స్ వస్తున్నారు.
పుస్తకమంటే జ్ఞానం. సర్వజన నేస్తం. అధ్యయనం పట్ల నేటి యువత ఆసక్తి చూపుతున్నది. సమాజ మార్పులో పుస్తకం పాత్ర కీలకం. ఇంటర్నెట్ యుగంలో పుస్తకం ప్రాధాన్యత తగ్గుతున్నదనేది ఒట్టిమాటే. ఉన్నత చదువుల్లో బిజీగా ఉండి కూడా యువత రచనలు చేయడం మంచి పరిణామం. ఆహ్వానించదగినది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా పుస్తక ప్రదర్శనలకు ఆదరణ పెరుగుతున్నది. ఆ దిశలోనే హైదరాబాద్ బుక్ ఫెయిర్ చెప్పుకోదగ్గ పుస్తక ప్రదర్శనగా ఎదిగింది. ప్రతి సంవత్సరం లక్షలాదిమంది పుస్తక ప్రియులను ఒక్కచోటకి చేర్చి జాతరను తలపిస్తున్నది. సమాజాన్ని మేల్కొలిపే అక్షర సమూహంగా బుక్ ఫెయిర్ మారింది. డిసెంబరు 19 నుంచి 29 వరకు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో గల అందెశ్రీ ప్రాంగణంలో హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఆధ్వర్యంలో 38వ హైదరాబాద్ పుస్తక ప్రదర్శన జరుగనున్నది.
జీవితంలో ఎవరైనా కోరుకునేది సుహృద్భావ వాతావరణంలో బతకాలన్నదే. భిన్నమైన ఆచారాలు, సాంప్రదాయాలు పుట్టుకతో రావచ్చు గాక, వారందరినీ కలిపి ఉంచేది మానవీయతనే. భిన్నత్వంలో ఏకత్వం అనే భావన చెడకుండా కొనసాగాలంటే దానికి అనుగుణమైన రచనలను సమాజంలోకి వెదజల్లాల్సిన అవసరముంది. అంతిమంగా మనుషులను విభజించని సాహిత్యం రావాల్సిన అత్యావశ్యకత ఉంది. దానికై ప్రణాళికాబద్ధంగా కృషి చేయాల్సిన బాధ్యత యువ రచయితలపై ఉందని మేము భావిస్తున్నాము. మానవజాతిని కదిలించే శక్తి పుస్తకానికి ఉంది. అ ధ్యయనం చేయకపోతే ఎదుటివారు చెప్పేదే నిజమనే భావనలోకి కూరుకుపోతాం. డాక్టర్లుగా, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులుగా మరే ఉన్నత ఉద్యోగం లో రాణించాలన్నా సామాజిక స్పృ హ తప్పనిసరి. పుస్తకజ్ఞానం ఉన్నవారే జీవితంలో రాణిస్తారు. ఉన్నతస్థాయిలో ఉన్నవారినెవరిని పరిశీలించినా అది మనకు కనిపిస్తున్నది. మంచి సమాజం కావాలంటే పుస్తకాలు చదవాలి.
బాలసాహిత్యం కొనుగోలు పెరగటం మంచి పరిణామం. చిన్నపిల్లల తో విరివి గా కథల పుస్తకాలు చదివించాలి. ఇది పిల్లల్లో సృజనాత్మకతను పెంపొందిస్తుంది. ఏఐ టెక్నాలజీ, సోషల్‌మీడియా ఇంకేం వచ్చినా, పుస్తకాలకు శాశ్వత విలువ ఉంటుంది. పుస్తకం చదివితే వచ్చే మానసికానందం వెలకట్టలేనిది. ప్రభుత్వ తోడ్పా టు మరింత పెరగాలి. హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఆధ్వర్యంలో ఏటా నిర్వహిస్తున్న జాతీయ పుస్తక ప్రదర్శన నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం మరువలేనిది. కొన్నేండ్లుగా బుక్ ఫెయిర్ నిర్వహణకు ఎన్టీఆర్ స్టేడియాన్ని ఉచితంగానే ఇస్తున్నది. దీనిలో పుస్తకాల ప్రదర్శనలో ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల ప్రచారానికి కొన్ని స్టాళ్ళను కేటాయిస్తున్నాం. హైదరాబాద్ బుక్ ఫెయిర్‌కు సొంత భవనమంటూ లేదు. సాహిత్య కార్యక్రమాలు, పుస్తకావిష్కరణలు జరుపుకునేందుకు ఒక కాన్ఫరెన్స్ హాల్ ఉండాలి. సాహితీ ప్రముఖులు, పుస్తకాల పబ్లిషర్స్ హైదరాబాద్‌కు వచ్చినప్పుడు ఉండటానికి కొన్ని రూములతో కూడిన భవనం ఉండాలి. అలాచేస్తే హైదరాబాద్ బుక్ ఫెయిర్ విశిష్టత, కదలిక, పనివిధానం పెరుగుతుంది. మరింత మెరుగవుతుంది. ఆ వైపుగా ప్రభుత్వం సహకరించాలి.
పాఠశాలలు, కళాశాలల్లో సామాజిక, సాహిత్య శాస్త్రాల అధ్యయనం పెరగాలి. పాఠశాలలు, కళాశాలల్లో సామాజిక, సాహి త్య, శాస్త్రాలు చదువుకునే అవకాశాలను పెంచాలి. ఆవైపు పిల్లలను తీర్చిదిద్దాలి. నిజమైన చరిత్రలు నమోదు కావాల్సిన అవసరముంది. మరుగునపడిన పుస్తకాల ప్రస్తావన తెరపైకి తేవాలి. బుక్ ఫెయిర్‌లో నచ్చిన పుస్తకం, ప్రభావితం చేసిన పుస్తకం అనే థీమ్‌తో ప్రముఖ రచయితలు, కవులతో ‘పుస్తక స్ఫూర్తి’ చర్చావేదిక నడుస్తోంది. మరుగునపడిన అనేక పుస్తకాల ప్రస్తావన మళ్లీ తెరమీదికి వస్తోంది. కొత్తతరంలో ఆసక్తిని రేకెత్తించి, వాటిని చదవడానికి పురిగొల్పే వాతావరణాన్ని తీసుకురావ డం దీని ముఖ్య ఉద్దేశం.
చదువు జ్ఞానానికి సింబల్. ప్రస్తుతం చదువుకోవడం జ్ఞానానికి సింబల్ అనే భావన నుంచి ఉద్యోగం కోసం చదువు అనే పరిస్థితి ఉంది. విద్యాలయాల్లో చదువుల నిర్వచనం మారి మార్కులతో విద్యను కొలిచే పద్ధతి వచ్చింది. దీంతో జనరల్ బుక్స్ చదవడం మానేసి ఆ సబ్జెక్ట్‌కే పరిమితం కావాల్సిన పరిస్థితి. ఉద్యోగాల సాధనకు పనికొచ్చే చదువే ముందుకొస్తున్నది. అందుకే సాహిత్య, సామాజిక, శాస్త్రాలను చదివే వారి సంఖ్య క్రమంగా తగ్గుతున్న ది. ఇది నాణానికి ఓవైపు మాత్రమే. మరోవైపు పరికించి చూస్తే రాయడం, చదవడం, అచ్చువేయడం వైపు యువత ఎక్కువ దృష్టి సాధించడం శుభపరిణామం. కొందరు ఇండ్లనే గ్రంథాలయాలుగా మార్చుతున్నారు. గ్రామాల్లో వాటిని నిర్వహిస్తున్నారు. ఇది మంచి పరిణామం.
రాబోయే కాలంలో సాంస్కృతిక రంగాల్లో ఒక పునర్జీవనం, కొత్త చైతన్యం రాబోతున్నది. యువతను అధ్యయనం, రాయడం వైపు మళ్లించే బాధ్యత సామాజిక సంఘాలపైనా, ప్రభుత్వాలపైనా ఉంది. బుక్ ఫెయిర్‌ల లక్ష్యం పుస్తకాలు అమ్మడం, కొనడం అనే ప్రక్రియ మాత్రమే కాదు. పుస్తకాలను ప్రజల దగ్గరకు విస్తృతంగా చేర్చడం, మెరుగైన సమాజం దిశగా అడుగులు వేసేలా పౌరుల ను తీర్చిదిద్దడం లక్ష్యంగా ఉండాలి. ఈ పది రోజుల్లో కూడా పుస్తకాల మీద చర్చలు, సాహి త్య, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం, స్కూల్, కాలేజీ పిల్లలు బుక్ ఫెయిర్‌ను సందర్శించేలా చేయడం ద్వారా పుస్తకాలు చదివే సంస్కృతి వైపు వారిని నడిపించే బాధ్యతను బుక్ ఫెయిర్ తలకెత్తుకున్నది.
ఇంతితై.. వటుడింతైనట్టుగా చిక్కడపల్లిలో సిటీ సెంట్రల్ లైబ్రరీలో నాలుగైదు పబ్లిషింగ్ సంస్థలు, సెల్లర్స్‌తో ప్రారంభమైన హైదరాబాద్ బుక్ ఫెయిర్ గణనీయమైన స్థాయికి నేడు చేరుకున్నది. మనదేశంలో కలకత్తా, బెంగుళూరు, ముంబై, ఢిల్లీ, జైపూర్ లాంటి బుక్ ఫెయిర్లతో పాటు జాతీయ స్థాయికి హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఎదుగుతుందనే ఆశ ఉన్నది.
-కవి యాకూబ్, (అధ్యక్షుడు) మలుపు బాల్రెడ్డి, (ఉపాధ్యక్షుడు) ఆర్.శ్రీనివాస్ (వాసు) కార్యదర్శి