వాషింగ్టన్: అమెరికాలో నివసిస్తున్న హెచ్1బీ, హెచ్4 వీసాదారులకు అమెరికన్ కాన్సులేట్ల నుంచి ‘ప్రుడెన్షియల్ రివోక్ట్’ ఈమెయిల్స్ వస్తున్నాయి. వీటివల్ల ఇప్పటికే అమెరికాలో ఉంటున్న ఈ వీసా హోల్డర్లకు ఇబ్బంది ఉండదు. ఇమిగ్రేషన్ అటార్నీ ఎమిలీ న్యూమన్ ఇచ్చిన పోస్ట్‌లో తెలిపిన వివరాల ప్రకారంలా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీల దృష్టిలో గతంలో పడినవారికి ఇటువంటి ఈమెయిల్స్ వస్తున్నాయి. నేర నిర్ధారణ కానప్పటికీ వీటిని పంపిస్తున్నారు. చాలా సంఘటనల గురించి ఇంతకు ముందు వీసా స్టాంప్సులోనే వెల్లడించి, క్లియర్ చేసినప్పటికీ, ఈ నోటీసులు వస్తున్నాయి.
హెచ్1బీ, హెచ్ 4 వీసాలను తాత్కాలికంగా రద్దు చేసినప్పటికీ, అమెరికాలో చట్టబద్ధంగా నివసించడంపై ఎటువంటి ప్రభావం ఉండదు. వీసాదారుల చట్టబద్ధ నివాస అర్హతలో ఏదైనా సమస్య ఉందని ప్రభుత్వం అనుమానించిన సమయంలో విదేశాంగ శాఖ వివేకవంతంగా వీసా రద్దుపై నిర్ణయం తీసుకుంటుంది. దీన్నే ఫ్రుడెన్షియల్ వీసా రివోకేషన్‌గా పిలుస్తారు. అయితే ఇలా తాత్కాలికంగా రద్దు చేసినప్పటికీ వీసాదారులు తమ గడువు పూర్తయ్యేవరకు అమెరికాలో నివాసం కొనసాగించవచ్చు. అయితే ఒకసారి అమెరికా నుంచి బయటకు వెళ్తే వీసా గడువు ఉన్నప్పటికీ, మళ్లీ అమెరికాలోకి ప్రవేశించే అవకాశం ఉండదు. తాత్కాలిక రద్దు సమయంలో వీసాల స్టాంప్ చెల్లుబాటు కాదు.