తుఫాను విసురుకి నేలకేసి తలబాదుకునే చెట్టుగా
నా కథను చిత్రించడం సులువు
చినుకు స్పర్శకు తుళ్ళిపడి లేచే చిగురు రూపాన్ని
వాళ్ళు సరిగా గీయలేరు
వాళ్ళకు, కథలో లేని రంగుల్ని
అద్దడం వచ్చి వుండొచ్చు
ఆ కళతో వాళ్ళు
నా బ్లాక్ అండ్ వైట్ చిత్రాన్ని చెడగొడతారు
వాళ్ళకు, కథను బిగువుగా అల్లే నేర్పుండొచ్చు
ఆ నేర్పుతో వాళ్ళు నా ప్రవేశ
నిష్క్రమణల మీద హద్దుల్ని గీస్తారు
ప్రతి అంకం, ఇలాగే మొదలవ్వాలి
ఇలాగే ముగిసిపోవాలని
వాళ్ళకు కొన్ని సూత్రీకరణలుండొచ్చు
వాటి అనువర్తనంతో నా కథ
నాది కాకుండాపోతుంది
నేను నా కనురెప్పల మీద కలలుగా పూస్తాను
ఒక్కోసారికి కలలన్నీ తెంపేసుకుని
నీ స్వప్నమూ అవుతాను
వేరొకరైతే, కథ మొత్తాన్ని
హేతువులతో నింపేస్తారు
కథను కొన్నిచోట్ల ఊహలకు వదిలేయడం ఇష్టం
మీరే చెప్పండి ఊహలో, కలలో లేకపోతే
దాన్ని జీవితం అని ఎలాగంటాం?
– సాంబమూర్తి లండ