కేంద్ర ప్రభుత్వం సోమవారం మూడు కీలకమైన బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఇవి కాకుండా అజెండాలో చేర్చిన వాటిలో ఒక్కటైన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాథి హామీ చట్టం (ఎంజిఎన్‌ఆర్‌జిఎ)ను ప్రారంభ దశలోనే వెనకకు తీసుకుంది. ప్రతిపక్ష ఇండియా కూటమి ఎంపిల తీవ్ర నిరసనలతో కేంద్రం ముందుగా ఈ బిల్లును అజెండాలో పెట్టిన తరువాతి దశలో దీనిని ప్రస్తుతానికి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. మమహాత్మా గాంధీ పేరు లేకుండా పథకం తీసుకువచ్చేలా బిల్లును రూపొందించడంపై ప్రతిపక్షాలు ఐక్యంగా ప్రభుత్వాన్ని నిలదీశాయి . సమాఖ్య విధానం దెబ్బతీస్తూ, రాష్ట్రాల ప్రయోజనాలకు భంగకరంగా మారుతూ, తరాల జాతీయ సంవిధానానికి అతీతంగా ఉండేలా రూపొందిన బిల్లును ప్రతిపాదన దశలోనే ఇండియా కూటమికి చెందిన విపక్షాలు బలంగా వ్యతిరేకించాయి. దీనితో కేంద్ర ప్రభుత్వం ఈ శీతాకాల పార్లమెంట్ సెషన్‌లో తొలిసారిగా ఈ విషయంలో అస్త్ర సన్యాస తీరును ప్రదర్శించాల్సి వచ్చింది. ఇక అణు రంగంలో ప్రైవేటు భాగస్వామ్యం, ఉన్నత విద్యారంగం నియంత్రణ , కొన్ని నిరర్థక చట్టాల రద్దు సంబంధిత బిల్లులను లోక్‌సభలో ముందు అజెండా మేరకు ప్రవేశపెట్టింది.
మొత్తం మీద మూడు ప్రధాన బిల్లుల పట్ల ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వెలువడ్డాయి. కీలక రంగాలపై కేంద్రానికి విస్తృత అధికారాలు , ఈ క్రమంలో రాష్ట్రాల హక్కులకు భంగం వాటిల్లడం వంటి పరిణామాలను ప్రతిపక్షాలు ప్రస్తావించాయి. అంతేకాకుండా పథకాలకు హిందీలో పేర్లు పెట్టడం రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధం అని విమర్శించారు. ప్రభుత్వం ముందుగా పాత చట్టాల రద్దు బిల్లును తీసుకువచ్చింది, తరువాత వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ బిల్లును ఉన్నత విద్యాసంస్కరణల పేరిట ప్రవేశపెట్టింది. తరువాత అణరంగ సంస్కరణల కోసం స్వయంసమృద్ధి అణు వనరుల సమీకరణ పేరిట అణు ఇంధన రంగ పరివర్తన బిల్లు తీసుకువచ్చింది.కేంద్ర పరిధిలోని పిఎంఒ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ దీనిని ప్రవేశపెట్టారు. దీనినే శాంతి బిల్లు సంక్షిప్తంగా వ్యవహరించారు. ఇక జాతీయ గ్రామీణ ఉపాధి పథకం పేరు మార్పు, భారీ స్థాయి ప్రక్షాళనకు ఉద్ధేశించిన బిల్లును వాయిదా వేసింది. అజెండాలో దీనిని ముందుగా చేర్చారు. అయితే కారణం తెలియచేయకుండానే దీనిని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రభుత్వం తెలిపింది, అయితే ప్రక్షాళన పేరిట పథకం భారాన్ని రాష్ట్రాలపై మోపేందుకు కేంద్రం ఎత్తుగడకు దిగిందని,గాందీజి పేరు తీసివేయడం కుదరదని ప్రతిపక్షాలు పార్లమెంట్ వెలుపల నిరసనలకు దిగడంతో దీనిని వెనకకు తీసుకువ్నారని వెల్లడైంది. ఇక ఉన్నత విద్యా బిల్లును విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సభలో ప్రవేశపెట్టారు.
పార్లమెంట్ సంయుక్త కమిటీ (జెపిసి) పరిశీలనకు పంపిస్తామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజూ తెలిపారు. శాంతిబిల్లు, విబిజి రామ్ బిల్లును కూడా సంబంధిత స్థాయీ సంఘాల పరిశీలనకు పంపించేందుకు ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య అంగీకారం కుదిరింది. ప్రైవేటు రంగానికి అణు ఇంధన సెక్టార్‌ను కట్టబెట్టడం వల్ల దేశ ప్రయోజనాలకు విఘాతం ఏర్పడుతుందని కాంగ్రెస్ ఎంపి మనీష్ తివారీ విమర్శించారు. కేంద్రానికి విపరీత అధికారాలు దక్కుతాయి. ప్రైవేటు రంగం ప్రమాదకర నయా అణు కార్యకలాపాలకు దిగేందుకు కేవలం తమ ప్రయోజనాల కోసం దేశ భవితను దెబ్బతీసేందుకు రంగం సిద్ధం చేసినట్లు అవుతుందని వ్యాఖ్యానించారు. ఆర్‌ఎస్‌పి , డిఎంకె ఎంపీలు ఉన్నత విద్య బిల్లు రాష్ట్రాల ప్రయోజనాలు ప్రత్యేకించి సమాఖ్య విధానానికి విరుద్ధంగా ఉన్నాయని విమర్శించారు. రాష్ట్రాలలో ఉన్నత విద్యారంగంపై కేంద్రం పెత్తనానికి దారితీస్తుందని డిఎంకె సభ్యులు జి సెల్వం, కాంగ్రెస్ ఎంపి ఎస్ జోతిమణి అభ్యంతరం వ్యక్తం చేశారు. బిల్లును హిందీలో తీసుకురావడంపై డిఎంకె నిరసనకు దిగింది. ఇక న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మెఘావల్ 71 నిరర్థక చట్టాల రద్దు బిల్లును తీసుకువచ్చారు. అయితే బిల్లులోని అంశాలను పూర్తిస్థాయిలో పరిశీలించే అవకాశం ఇవ్వలేదని ప్రతిపక్షాలు ఎదురుదాడికి దిగాయి.