మన తెలంగాణ/హైదరాబాద్: రాజ్యాంగాన్ని రద్దు చేయాలని బిజెపి కుట్ర చేస్తున్నదని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆరోపించారు. ఓట్ చోరీ తర్వాత ఆధార్, జమీన్, రేషన్ కార్డులనూ రద్దు చేస్తుందని ఆయన ఆరోపించారు. ఓట్ చోరీ గద్దీ చోడ్ పేరిట ఢిల్లీలోని రాం లీలా మైదానంలో ఏఐసిసి ఆదివారం నిర్వహించిన మహా ధర్నాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ కేంద్రంపై నిప్పులు చెరిగారు. ఈ మహా ధర్నాలో ఏఐసిసి చీఫ్ మల్లిఖార్జున ఖర్గే, ఏఐసిసి అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, పలువురు ఏఐసిసి నాయకులు, తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, పిసిసి చీఫ్ బి. మహేష్ కుమార్ గౌడ్, వివిధ రాష్ట్రాల ముఖ్య నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ నాడు మహాత్మా గాంధీ, అంబేద్కర్ తదితరులు రాజ్యాంగాన్ని రచించుకోవాల్సిన అవసరం ఉందని చర్చిస్తున్నప్పుడు ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతకర్త ఎంఎస్ గోల్వర్కర్ దళితులకు, గిరిజనులకు, మైనారిటీలకు, పేదలకు ఓటు హక్కు కల్పించరాదని అన్నారని చెప్పారు. అయితే గాంధీ, అంబేద్కర్ అదేమీ పట్టించుకోకుండా అందరికీ
ఓటు హక్కు కల్పించినందుకే ఇప్పుడు దళితులు, గిరిజనులు, మైనారిటీలు, పేదలు ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారని ఆయన వివరించారు. గోల్వర్కర్, ఆర్‌ఎస్‌ఎస్ భావజాలంతో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తదితరులు ఉన్నారని ఆయన చెప్పారు. ఆర్‌ఎస్‌ఎస్, గోల్వర్కర్ భావజాలాన్ని అమలు చేసేందుకే తమకు లోక్‌సభలో నాలుగు వందల సీట్లు కావాలని బిజెపి ఎత్తుగడ వేసిందని, అయితే ఆ రకమైన మెజారిటీ లభిస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తారని, రాజ్యాంగాన్ని రద్దు చేస్తారని ఏఐసిసి అగ్ర నేత రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా విస్తృంగా ప్రచారం చేసినందుకే ప్రజలు ఆలోచించి ఓట్లు వేయలేదన్నారు. అయినా ఆ పార్టీకి రెండు వందల నలభై సీట్లు వచ్చాయన్నారు. నాలుగు వందల సీట్లు వచ్చి ఉంటే రాజ్యాంగాన్ని రద్దు చేసి, రిజర్వేషన్లు లేకుండా చేసే వారని అన్నారు. ‘సర్’ పేరిట ఓట్ల గల్లంతు అవుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఓట్ చోరీ జరుగుతున్నదని, భవిష్యత్తులో ఆధార్ కార్డు, భూమి, రేషన్ కార్డులూ తొలగిస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఓట్ చోరీపై రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి తెలంగాణ మొత్తం అండగా నిలబడుతుందని, అదేవిధంగా దేశం మొత్తం కూడా బాసటగా నిలబడాలని ఆయన పిలుపునిచ్చారు. ఓట్ చోరీపై రాహుల్ గాంధీ అనేక ఆధారాలతో బయట పెట్టారని ఆయన చెప్పారు.
భారీగా హాజరైన తెలంగాణ నేతలు
ఇదిలాఉండగా ఢిల్లీలో ఓట్ చోరీ మహా ధర్నాకు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని పిసిసి చీఫ్ బి. మహేష్ కుమార్ గౌడ్ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రం నుంచి అనేక మంది ముఖ్య నాయకులు తమ అనుచరులతో, పార్టీ కార్యకర్తలతో కలిసి హస్తినలో జరిగిన సభకు హాజరయ్యారు.