మెదక్ జిల్లాలో భారీ పేలుడు సంభవించింది. సోమవారం జిల్లాలోని మనోహరాబాద్ మండలం చెట్లగౌరారంలో ఉన్న ఎంఎస్ అగర్వాల్ స్టీల్ కంపెనీలో పెద్ద ఎత్తున పేలుడు చోటుచేసుకుంది. దీంతో పరిశ్రమ పరిసర ప్రాంతాల్లో దట్టంగా పొగ అలుముకుంది. ఈ ఘటనలో ఓ కార్మికుడు ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స కోసం సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపు చేశారు.భారీ పేలుడుతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో మరణించిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.