వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ప్రత్యర్థి పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీని లక్ష్యంగా చేసుకుని బిజెపి తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. సిఎం మమతను అడాల్ఫ్ హిట్లర్‌తో పోల్చస్తూ సోషల్ మీడియాలో సంచలన పోస్ట్ పెట్టింది. మమత బెనర్జీని నియంతగా అభివర్ణించింది. అంతేకాదు,ఆమెను హిట్లర్‌తో పోలుస్తూ.. ఇద్దరి సగం సగం ముఖాలను ఒకే ఫోటోగా క్రియేట్ చేసి సోషల్ మీడియా పోస్ట్ చేసింది. ఈ ఫోటో వైరల్ కావడంతో బెంగాల్ లో రాజకీయ వివాదం నెలకొంది.
కాగా, అర్జెంటీనా ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ టూర్ కూడా ఫెయిల్ కావడంతో బిజెపి నేతలు, సిఎం మమతపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. గోట్ టూర్ సందర్భంగా పశ్చిమ బెంగాల్ వచ్చిన మెస్సీ.. కోల్‌కతా స్టేడియంలో కేవలం 10 నిమిషాలు మాత్రమే గడిపిన తర్వాత వెళ్లిపోయాడు. దీంతో ఆగ్రహంతో రెచ్చిపోయిన ఫుట్‌బాల్ అభిమానులు స్టేడియంను ధ్వంసం చేశారు. ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. నిర్వహణ లోపం కారణంగానే ఈ ఘటన జరిగిందని, గోట్ ఇండియా టూర్ 2025 ప్రమోటర్, నిర్వాహకుడు సతద్రు దత్తాను పోలీసులు అరెస్టు చేశారు. తర్వాత ఆదివారం బిధాన్‌నగర్ కోర్టు ముందు హాజరుపరిచారు. ఆయనను 14 రోజుల పోలీసు కస్టడీకి పంపారు.
అయితే, ఈ సంఘటన తర్వాత, ముఖ్యమంత్రి బెనర్జీ క్షమాపణలు చెప్పారు. ఈ విధ్వంసం పట్ల తాను చాలా బాధ పడ్డానని, దిగ్భ్రాంతికి గురయ్యానని పేర్కొన్నారు. దీనిపై ఆమె దర్యాప్తుకు ఆదేశించింది. అయితే, మెస్సీ టూరు విజయవంతం చేయడంలో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందని బిజెపి, కాంగ్రెస్ విమర్శలకు దిగాయి. ఈ ఘటనపై సిఎం మమత మొసలి కన్నీళ్లు పెట్టుకుందని.. పశ్చిమ బెంగాల్, ఫుట్‌బాల్ క్రీడ.. రెండింటికీ ఇది అవమానమని బిజెపి దాడికి దిగింది.